పశువుల ఆరోగ్యానికి జాగ్రత్తలివే!

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 03, 2020, 03:07 PM
 

వర్షాకాలంలో పశువులకు వివిధ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. పశు పోషకులు, రైతులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పశువులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. తగు జాగ్రత్తలతో పశువుల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈ తరుణంలో వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేక కథనం..


జాగ్రత్తలు:


వర్షపు నీటితో నేల చిత్తడిగా మారడం వల్ల పలు రకాల వైరస్‌లు పశువుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. పశువుల పాకతోపాటు వాటిని ఉంచే ప్రదేశాల నేల పొడిగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల పాక పైకప్పు వర్షాకాలంలో కారకుండా జాగ్రత్త పడాలి. షెడ్లలో నీరు కారడం వల్ల బురద, చిత్తడి ఎక్కువై పశువులు ఇబ్బంది పడతాయి. పేడ, మూత్రం రొచ్చుగా మారి వైరస్‌లకు అనువుగా తయారవుతుంది. గాలి సరిగా తగలకపోవడం వల్ల అమ్మోనియం వాయువు వెలువడి పశువులకు, జీవాలకు కంటి నుంచి నీరు కారుతుంది. పశు పోషకులు ఈ సమస్యలను గమనించి అప్రమత్తంగా వ్యవహరించాలి.


పోషణలో..


వర్షాకాలంలో వివిధ రకాల గడ్డి తిని పశువులు అనారోగ్యానికి గురవుతుంటాయి. ముఖ్యంగా కల్లం దొడ్లలోని మేత వర్షాకాలంలో తడిచిపోతుంటుంది. తడిచిన వరిగడ్డి, వేరుశనగ, కొర్ర గడ్డి బూజు పడుతుంది. వివిధ రకాల వైరస్‌లు వ్యాపిస్తాయి. అలాంటి గడ్డిని పశువులు తినడం వల్ల రోగాలు తొందరగా సోకుతాయి. వర్షాకాలంలో సాధ్యమైనంత మేర ఒట్టిగడ్డి తడవకుండా చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో పచ్చిగడ్డిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చిగడ్డి మేపిన పశువులకు కడుపు త్వరగా నిండి త్వరగా ఆకలికి వస్తాయి. అలాగే పేడ కూడా పలుచగా ఉండి, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పశువులలో అరుగుదలకు పీచు పదార్థం ముఖ్యం.


దీనికోసం లేత పశుగ్రాసాలు కాకుండా ఒక మోస్తారుగా ముదిరిన పశుగ్రాసాలను మేతగా వేయాలి. ఎండు గడ్డిని కూడా అందించాలి. పశుగ్రాసాల సాగుకు వర్షాకాలం అనుకూలమైనది. ఓ మోస్తరు పెద్ద పశువుకు రోజుకు కనీసం 15-20 కిలోల పచ్చిగడ్డి, 6-8 కిలోల ఎండు గడ్డి అవసరం. పాల దిగుబడిని బట్టి దేశవాలి, సంకర జాతి ఆవుల్లో ప్రతి 2.5-3 లీటర్ల పాల దిగుబడికి ఒక కిలో దాణా, గేదెలలో ప్రతి 2-2.5 లీటర్ల పాలిచ్చే గేదెకు ఒక కిలో దాణా ఇవ్వాలి. వర్షం కారణంగా నేలపై ఉన్న ఖనిజ లవణాలు కొట్టుకుపోతాయి. కాబట్టి విధిగా ప్రతి పశువుకు 50-60 గ్రాముల ప్రాంతీయ ఖనిజ లవణ మిశ్రమం అందించాలి. నిల్వ ఉంచిన దాణాకు వర్షాకాలంలో తేమ కారణంగా బూజు పట్టే ప్రమాదం ఉంటుంది. తేమ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


ముందు జాగ్రత్త..


ప్రతి పశువుకు, జీవానికి వర్షాకాలంలో విధిగా డీ వార్మింగ్‌ చేయించాలి. పేడ పరీక్ష చేయించి డీ వార్మింగ్‌ చేయించడం ఉపయుక్తం. పెద్ద పశువుల్లో దొమ్మరోగం, గాలికుంటు, హెచ్‌ఎస్‌బీక్యూ వ్యాధులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి. జీవాల్లో నీలి నాలుక, కాలి పుండు వ్యాధులకు తప్పకుండా టీకాలు వేయించాలి. గుంటల్లో నిల్వ ఉన్న నీటిని తాపకూడదు. నీరు నిల్వ చేసే ప్రదేశం అప్పుడప్పుడు క్లోరిన్‌తో శుభ్రపరిచాలి. దోమల బెడద నుంచి పశువులను రక్షించుకోవాలి. దోమల నివారణకు దోమ తెరలను, వేపాకు పొగను ఉపయోగించాలి.


ఈ కాలంలో బాహ్య పరాన్న జీవులైన దోమలు, ఈగలు, పిడుదులు, గోమార్లు త్వరగా వ్యాపిస్తాయి. ఇవి పశువుల రక్తాన్ని తాగి బలహీన పరుస్తాయి. వీటి నివారణకు బూటాక్స్‌, సైపర్‌మెత్రిన్‌ లాంటి మందులను వైద్యుల సూచన మేరకు తగు మోతాదులో పశువుల పాకలలో పిచికారీ చేయాలి. పశువులు, మూగజీవాల గిట్టలను ఎప్పటికప్పుడు వర్షాకాలంలో గమనిస్తూ ఉండాలి. వర్షంలో తడవ డం వల్ల గిట్టలు మెత్తబడి ఉంటాయి. తిరిగేటప్పుడు రాళ్లు, గట్టి పుల్లలు గుచ్చుకొని రంధ్రాలు పడి గాయాలు అవుతాయి. నోటిలో ఎలాంటి బొబ్బలు వచ్చినా వెంటనే వైద్యులకు చూపించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.


నోటి బొబ్బలను పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణంతో శుభ్రపరిచి జింక్‌ పౌడర్‌ను పై పూతగా పూసి చాలా వరకు వ్యాధిని నివారించవచ్చు. ఆవులు, గేదెలను పాలు పిండిన వెంటనే పడుకోనివ్వవద్దు. పాలు పిండిన వెంటనే పశువులు పడుకోవడం వల్ల వాటి చనురంధ్రం ద్వారా సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. తద్వారా పొదుగు వాపు లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.