ఏపీ మూడు రాజధానుల ఇష్యూలో కొత్త మలుపు..

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 03, 2020, 01:33 PM
 

3 రాజధానుల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతపై టీడీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అటు రాజధాని రైతు పరిరక్షణ సమితి కూడా గెజిట్‌ను తీవ్రంగా తప్పుబట్టుతోంది. ఈ క్రమంలో సోమవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలన్న పిటిషనర్ కోర్టును కోరారు. రాజ్ భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారించనుంది ఏపీ హైకోర్టు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు జులై 31న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్రవేశారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఓకే చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో ఇకపై విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అలాగే, అమరావతి శాసన రాజధాని కానుంది. కర్నూలుకు హైకోర్టు తరలివెళ్లనుంది.
ఆగస్టు 15 వరకు అన్ని కార్యాలయాలను విశాఖకు తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా అక్కడ జరిగే అవకాశముందని సమాచారం.మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలపడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలు చేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తన పదవికి రాజీనామా చేశారు.
అదే బాటలో పలువురు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. మరోవైపు అమరావతి పరిరక్షణ జేఏసీ, రాజధాని రైతు పరిరక్షణ సమితి కూడా ఆందోళనలకు సిద్ధమవుతోంది. ఓ వైపు నిరసనలు వ్యక్తం చూస్తూనే.. మరోవైపు న్యాయ పోరాటం చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. విపక్షాల విమర్శలను ఏపీ ప్రభుత్వం తిప్పికొడుతోంది. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేస్తోంది.