మార్కెట్లోకి గేమింగ్ స్మార్ట్ ఫోన్లు వరదలా వస్తున్నాయి. అసుస్ రోగ్ ఫోన్ 3, నుబియా రెడ్ మ్యాజిక్ 5ఎస్ మార్కెట్లోకి వచ్చీ రాగానే ఇప్పుడు మరో గేమింగ్ స్మార్ట్ ఫోన్ అడుగు పెట్టింది. అదే బ్లాక్ షార్క్ 3ఎస్. ఈ సంవత్సరం మార్చిలో బ్లాక్ షార్క్ 3, బ్లాక్ షార్క్ 3 ప్రోలు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు అదే సిరీస్ లో ఈ ఫోన్ కూడా వచ్చేసింది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, యూఎఫ్ఎస్ 3.1 ఫ్లాష్ స్టోరేజ్ వంటి ఫీచర్లను ఇందులో అందించడం విశేషం.ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 20 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.ఇందులో 5జీ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. వైఫై 6, బ్లూటూత్ 5 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో 4729 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 65W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేయనుంది. దీని మందం 1.04 సెంటీమీటర్లుగానూ, బరువు 222 గ్రాములుగానూ ఉంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.42,620గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.45,800గా ఉంది. స్కై క్లౌడ్ బ్లాక్, క్రిస్టల్ బ్లూ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.