కరోనా మృతదేహాలకు వైసీపీ ఎమ్మెల్యే అంత్యక్రియలు

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 01, 2020, 07:18 PM
 

కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత కొద్దిరోజులుగా జిల్లా ప్రజలను హడలెత్తిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జిల్లాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు భయంతో హడలిపోతున్నారు. మరోవైపు మరణాలు కూడా అత్యధికంగానే నమోదు అవుతున్నాయి. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు కనీసం బంధువులు కూడా అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితి.ఇలాంటి తరుణంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని ఓ శ్మశానవాటికలో వారి మతాచారాలను పాటిస్తూ కార్యక్రమం పూర్తి చేశారు. ప్రజలెవరూ కరోనా మృతదేహాలను చూసి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారి వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు.