ఏపీలో కరోనా వైద్యానికి ఫీజులివే

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 09, 2020, 03:41 PM
 

కరోనా వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా రేషన్ కార్డు లేని కరోనా రోగులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చిన విషయం తెలిసిందే. మరికొన్ని కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చింది. నాన్‌ క్రిటికల్‌ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకి 3,250 రూపాయలు, క్రిటికల్‌ కోవిడ్‌-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్‌ఐవీ లేకుండా ఉంచితే రోజుకి 5,480 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. ఎన్‌ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ. 5,980 వసూలు చేయనున్నారు. వెంటిలేటర్‌ ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ. 9,580గా నిర్ధారించారు. ఇన్ఫెక్షన్‌ ఉన్న వారికి వెంటిలేటర్‌ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ. 6,280గా నిర్ణయించారు. ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380 ఫీజు వసూలు చేయనున్నారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రులన్నీ ఇవే ఫీజులను వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.