టీవీ ఎక్కువగా చూస్తున్నారా.. అయితే మీకు ఈ సమస్య ఉన్నట్లే

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 08, 2020, 12:50 PM
 

లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో అందరూ ఇంటికి పరిమితమయ్యారు. ఇంతకు ముందు ఆఫీసులు, బయటి పనులతో చాలా సమయం బయటే గడిపేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంతా ఇంటికి పరిమితమయ్యారు. ఏం చేయాలో తెలియక ఇంటర్నెట్‌లో వీడియోలు, టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టీవీ చూస్తే కాసేపు కాలక్షేపం. టైమ్‌పాస్ అవ్వడానికి చూస్తుంటారు. అయితే, కొందరు మాత్రం అదే పనిగా టీవీ చూస్తుంటారు. ఇది ఇప్పుడు మాత్రమే కాదు.. ముందు కూడా ఇలానే ఎక్కువ సమయం టీవీ చూసేవారు. అయితే, ఇలాంటి వారిని పరీక్షించిన పరిశోధకులు కొత్త విషయాలను చెబుతున్నారు. అవేంటంటే.. వివిధ రకాల సమస్యలు, కోరికలు ఉండి అవి తీరకపోతే ఆ అసంతృప్తితో ఉన్నవారే ఎక్కువగా టీవీ చూస్తుంటారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మేరీ ల్యాండ్ యూనివర్శిటీ నలభై వేల మందిపై అధ్యయనం జరిపింది. ఈ అధ్యయనంలో ఆసక్తిగొలిపే విషయాలను బయటపెట్టింది. వివిధ రకాల సమస్యలు, కోరికలు ఉన్న వారు అవి తీరక అసంతృప్తితో ఉంటే దాంతోనే టీవీ చూస్తుంటారని ఆ సర్వే వెల్లడించింది. ఆనందంగా ఉండేవారు టీవీ చూసే గంటలతో పోలిస్తే అసంతృప్తిపరులు 30 శాతం ఎక్కువగా రకరకాల ప్రోగ్రామ్స్ చూసేందుకు ఆసక్తి చూపిస్తారని తేలింది. టీవీ చూడడం వల్ల తాత్కాలికంగా మనసుకు ఊరటగా అనిపించినా ముందు ముందు తీవ్ర నిరాశకు గురవుతారని చెబుతున్నారు. సమస్య నుండి బయటపడాలంటే.. పుస్తకాలు చదవడమో.. స్నేహితులతో కాలక్షేపం చేస్తే సమస్య చాలా వరకూ తగ్గుతుందని, ముఖ్యంగా సన్నిహితులతో చక్కని సంబంధాలు కలిగి ఉంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు.