రేపే ఇంగ్లాండ్, విండీస్ తొలి టెస్ట్

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 07, 2020, 07:53 PM
 

కరోనావైరస్ కారణంగా గత నాలుగు నెలలుగా క్రికెట్ పూర్తిగా నిలిచిపోయింది. కానీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభం కానుంది. కోవిడ్ మహమ్మారి తీవ్రత ప్రస్తుతం కాస్త నెమ్మదించింది. ఈ నేపథ్యంలో మూడు టెస్టుల సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 8 కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది. కోవిడ్ మహమ్మారి అనంతరం ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య రేపటి నుంచి మూడు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. దీంతో ఈ మ్యాచ్ పైనే ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. నాలుగు నెలల తర్వాత జరిగే తొలి అంతర్జాతీయ సిరీస్ బయో సెక్యూర్ వాతావరణంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ పూర్తిగా స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా జరగనుంది. ఆటగాళ్ళు ఒకరినొకరు కౌగిలించుకోవడం లేదా విష్ చేసుకోవడం లాంటివి ఉండవు. కరోనా కారణంగా క్రికెట్ నియమాలలో చూడగలిగే అతి పెద్ద మార్పు బంతిపై ఉమ్మి వాడకం. ఐసిసి ఇప్పటికే దీనిని నిషేధించింది. ఈ నియమాల మధ్య రేపు క్రికెట్ మ్యాచ్ జరగనుంది.