ఈ ఎస్సై మామూలామె కాదు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 07, 2020, 07:23 PM
 

ఆమె మహిళా పోలీసు అధికారి. బాధితులకు అండగా ఉండాల్సిన ఆమే తప్పు దారి పట్టింది. లంచం తీసుకొని కేసు క్లోజ్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అడ్డంగా బుక్కయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసే ఇద్దరు మహిళలు కంపెనీ ఎండీ కెనాల్ షా తమ పై అత్యాచారం చేశాడని 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు పై అప్పటి నుంచి విచారణ కొనసాగుతుంది. ఈ కేసు విచారణ బాధ్యతను అహ్మదాబాద్ మహిళా పీఎస్ లో పని చేసే శ్వేతా జడేజాకు అప్పగించారు. కేసును నిష్ఫక్షపాతంగా విచారించి బాధితులకు అండగా నిలవాల్సిన శ్వేతా నిందితునికి అనుకూలంగా వ్యవహరించింది. అతని నుంచి డబ్బు తీసుకొని కేసు క్లోజ్ చేసేందుకు ప్రయత్నించింది. రూ.35 లక్షలు లంచంగా ఇస్తే ఈ కేసును క్లోజ్ చేస్తానని నిందితుడు కెనాల్ షాకు ఎస్సై శ్వేతా ఆఫర్ ఇచ్చింది. కెనాల్ షా మరియు ఆయన సోదరుడు భావేష్ లతో కలిసి శ్వేత రూ.20లక్షలకు డీల్ కుదిరింది. డీల్ ప్రకారం భావేష్ నగదు చెల్లించాడు.ఆ తర్వాత కొన్ని రోజులకు మరో 15 లక్షలు ఇవ్వాలని లేకపోతే కేసులో ఇరికించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని వేధించింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కెనాల్ షా,భావేష్ సోదరులు ఫిబ్రవరిలో సిటీ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని పై అంతర్గత విచారణ జరిపిన పోలీసులు శ్వేత పై ఆరోపణలు నిజమని తేల్చారు. విచారణ అనంతరం పక్కా ఆధారాలతో ఆమెను అరెస్టు చేశారు. మహిళా అధికారై ఉండి సాటి మహిళలకు అండగా నిలవాల్సింది పోయి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన శ్వేతను అంతా విమర్శిస్తున్నారు.