చిత్తూరులో అమర్ రాజా గ్రూప్‌కు ఏపీ ప్రభుత్వం షాక్

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 30, 2020, 05:39 PM
 

చిత్తూరులో అమర్‌రాజా గ్రూప్‌కు గత ప్రభుత్వం కేటాయించిన భూమిలో 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూములు నిరూపయోగంగా ఉన్నందున తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. రోశయ్య హయాంలోని గత ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2009లో అమర్ రాజా ఇన్‌ఫ్రా సంస్థకు చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నూనె గుండ్లపల్లి గ్రామాల్లో మొత్తం 483.27 ఎకరాలను కట్టబెట్టింది. ఆ ఒప్పందం ప్రకారం అమర్ రాజా కంపెనీ రూ. 2,100 కోెట్ల విలువైన పెట్టుబడులు పెడతామని చెప్పింది. తద్వారా 20వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పింది. కానీ అంత పెట్టుబడులు తీసుకురాక పోగా.. కేవలం 4,310 మంది మాత్రమే ఉపాధి కల్పించింది. అయితే భూములు కేటాయించిన రెండేళ్లలో ఆ భూములను పూర్తిగా వినియోగించాల్సి ఉంటుందని ఒప్పందంలోనే ప్రభుత్వం పేర్కొంది.
ఒకవేళ ఉపయోగించకపోతే ఖాళీగా ఉన్న భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పింది. కానీ అమర్ రాజా కంపెనీ మొత్తం 483.27 ఎకరాలకు గాను..229.66 ఎకరాలు మాత్రమే ఉపయోగించుకున్నట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగాల కల్పన లేకపోవడంతో పాటు సంస్ధ విస్తరణ కూడా చేపట్టకపోవడంతో ఖాళీగా ఉన్న భూములను వెనక్కి తీసుకోవాలని ఏపీఐఐసీకి పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది.