ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుఎస్ వీసా కావాలంటే ఆ వివరాలు చెప్పాల్సిందే..!

national |  Suryaa Desk  | Published : Wed, Jun 03, 2020, 04:46 PM

వీసాల జారీ విషయంలో అమెరికా మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఉగ్రవాదులు, ఇతర ప్రమాదకర వ్యక్తులను తమ దేశంలోకి రానీయకుండా అడ్డుకోవడం కోసం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసేవారు ఇక నుంచి సోషల్‌ మీడియా వివరాలు కూడా సమర్పించాలని కొత్త నియమాన్ని తీసుకొచ్చింది. ఇకపై అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిలో దాదాపు అందరూ, తాము వాడుతున్న అన్ని సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలూ చెప్పాల్సిందేనంటూ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీని ప్రభావం ఏటా ఒకటిన్నర కోటి మందిపై ఉండనుంది. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద భావజాలం ఎక్కువగా వ్యాప్తి చెందుతోందనీ, దేశ భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని అధికారులు అంటున్నారు.ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


తాత్కాలిక పర్యటన కోసం వచ్చే వారు సహా ఎవ్వరైనా ఈ వివరాలు తెలియజేయాల్సిందేననీ, ఒకవేళ ఎవరికైనా సామాజిక మాధ్యమాల్లో ఖాతాలే లేకపోతే వాళ్లు ఆ విషయమే చెప్పవచ్చని తెలిపారు. అయితే ఎవరైనా అబద్ధం చెప్పినట్లు తేలితే వలస నిబంధనలకు అనుగుణంగా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అధికారి హెచ్చరించారు. వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఏ పేర్లతో సోషల్‌ మీడియా అకౌంట్లను ఉపయోగిస్తున్నారో వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఐదేండ్లకు సంబంధించి ఈ మెయిల్‌ ఐడీ రిపోర్టు కూడా ఇవ్వాలి. ఒక వేళ వీసాకు దరఖాస్తు చేసుకున్న వారు తప్పుడు సమాచారం ఇస్తే వారి అప్లికేషన్‌ను తిర్కసరించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు.


మరోవైపు హెచ్‌1బీ సహా పలు రకాల వర్క్‌ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించే దిశగా అమెరికా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వర్క్‌ ఆథరైజేషన్‌తో కూడిన స్టుడెంట్‌ వీసాలపై నిషేధం విధించాలని భావిస్తోంది. కరోనా కారణంగా అమెరికా ఉద్యోగరంగంలో నెలకొన్న సంక్షోభంతో వర్క్‌ వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాలని ట్రంప్‌ సర్కారు యోచిస్తోంది. సాంకేతిక, ఇతర నైపుణ్యాలున్న విదేశీయులకు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగావకాశం కల్పించేదే హెచ్‌1బీ వీసా. ఈ వీసాకు భారత్, చైనాలో భారీ డిమాండ్‌ ఉంది. ఈ వీసాపై ప్రస్తుతం దాదాపు 5 లక్షల మంది విదేశీయులు అమెరికాలో ఉన్నారు. అమెరికా ప్రభుత్వం హెచ్‌–1బీ, ఎల్‌–1 వీసాల్లో కీలక సంస్కరణలకు తెర తీసింది. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడుతూనే ఆ దేశంలో చదువుకున్న విదేశీ యువతకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా బిల్లును రూపొందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com