మ్యాట్రిమోని వెబ్సైట్ల ద్వారా మోసాలు ఎక్కువవుతున్నాయి. ఆన్ లైన్ మోసాల్లో ఈ మధ్య మ్యాట్రిమోని మోసాల గురించి, బురిడీ కొట్టించే వార్తలు ఎక్కువగా షికారు చేస్తున్నాయి. తాజాగా మరో మోసం వెలుగుచూసింది. మ్యాట్రిమోనిలో పరిచయమైన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్ళిచేసుకుంటానని ఓ యువతి నమ్మించి అతని నుంచి కోటి రూపాయలకు పైగా వసూలు చేసి బురిడీ కొట్టించింది. దీంతో బాధితుడు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు అనుపల్లవి మాగంటి పేరుతో వరుడు కావాలంటూ ఓ యువతి తెలుగు మ్యాట్రిమోని వెబ్సైట్లో పేరు నమోదు చేసుకుంది. అమెరికాలోని మేరీల్యాండ్ బల్టీమోర్ ప్రాంతంలో జన్మించినట్లుగా వివరాలు నమోదు చేసింది. తాను డాక్టర్ అని, తన తల్లిదండ్రులు కూడా డాక్టర్లేనని, తన నివాసం జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–71లో ఉందని పేర్కొంది. ఆ వివరాలను చూసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమెతో పలుమార్లు చాటింగ్ చేశాడు. తనకు డబ్బున్న బిజినెస్‌మేన్ కొడుకును వివాహం చేస్తున్నారని అతనికి మాయమాటలు చెప్పింది. తనకు మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పింది. అయితే తన పేరుపై ఉన్న ఆస్తులను న్యాయపరంగా దక్కించుకునేందుకు కొంత డబ్బు అవసరముందని, ఇందుకు సహాయం చేయాలని కోరింది. మాయ మాటలు నమ్మిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పలుమార్లు కోటి రెండు లక్షల రూపాయలను ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా యువతి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం ఆమె మొహం చాటేసింది. తాను ఆన్లైన్లో చాటింగ్ చేసిన యువతి మాళవిక దేవతిగా గుర్తించడంతో పాటు తాను మోసపోయినట్లుగా భావించి కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.