ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1400 ఏళ్ల క్రితం వెలసిన కైలాసనాథుని ఆలయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 24, 2020, 10:01 AM

సృష్టిలో ప్రకృతి పురుషులైన పార్వతీ పరమేశ్వరులు భూమిపై కృతయుగం నుండి అనేక రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోర్కెలు తీర్చే భక్తవల్లభులుగా పురాణాలలో పేర్కొన్నారు. ప్రస్తుతం నెల్లూరుగా పిలవబడుతున్న అలనాటి సింహపురిలో 1400 సంవత్సరాల క్రితం నెల్లి వృక్షం క్రింద స్వయంభువుగా కైలాసనాథుడు వెలిశాడు. అందుకే ఈ ప్రాంతానికి నెల్లూరు అని పేరు వచ్చిందని పూర్వీకుల వివరణ. చోళరాజుల కాలంలో పట్టణానికి ఒక మూల వెలసిన ఈ స్వామిని మూలస్థానేశ్వరుడనే పేరుతో భక్తులు పూజించారు. అందుకే ఈ ప్రాంతానికి మూలాపేట అనే వాడుకలోకి వచ్చింది.

పూర్వం త్రినేత్రుడిగా పేరుపొందిన ముక్కంటి రెడ్డికి పశువుల మందవుంది. ఆ మందలో ఒక గోవు దేహమున చనిపోయిన బ్రాహ్మణ స్ర్తి ఆత్మ ప్రవేశించి, ప్రతినిత్యం నెల్లి చెట్టుకింద వున్న లింగానికి తన పాలతో అభిషేకం చేసేది. ఆ ఆవు సరిగా పాలు ఇవ్వడంలేదని గమనించిన మక్కంటిరెడ్డి పశువుల కాపరిని మందలించాడు. ఆ మరుసటి రోజు పశువుల కాపరి ఆ గోవు వెనకాలే వెళ్లి లింగంపై పాలు కురిపిస్తూ అభిషేకం చెయ్యడం చూసి కోపంతో కత్తితో గోవును కొట్టడానికి ప్రయత్నించగా ఆ కత్తి శివలింగానికి తగిలింది. కత్తి తగిలిన శివలింగం నుండి నెత్తురు రావడం గమనించి భయంతో పరుగులు తీసి ముక్కంటికి చెప్పాడు. ఆశ్చర్యచకితుడైన ముక్కంటి రెడ్డికి ఒకరోజు రాత్రి పరమేశ్వరుడు కనిపించి శివలింగం వున్న ప్రదేశంలో దేవాలయం నిర్మించమని చెప్పాడు. ఈనాటికి శివలింగంపై కత్తి తగిలిన చోట రక్తపు మరకలు కనిపిస్తాయి. ఈ స్వామి అత్యంత మహిమగల పరమేశ్వరుడని స్థానికుల నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలోనే సహస్ర లింగేశ్వరస్వామి మందిరం కూడా వున్నది. ఈ మందిరాన్ని అగస్త్యముని ప్రతిష్ఠించాడని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.

స్వామికి ఒకేసారి అభిషేకం చేస్తే 1008 సార్లు చేసినంత పుణ్యమని అంటారు. 13వ శతాబ్దంలో నెల్లూరు సీమను పాలించిన మనుమసిద్ధి ప్రభువు ఈ ఆలయనాకి రాజగోపురం నిర్మించారు. మూలస్థానేశ్వరస్వామికి ఎడమవైపున భువనేశ్వరి మందిరం, ఈ మందిరం చుట్టూ నవదుర్గలు కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్యస్వామి, విష్ణుమూర్తి, బ్రహ్మ, నవగ్రహాల మందిరాలు కూడా వున్నాయి. గాలి గోపురానికి ఎదురుగా తూర్పు దిక్కున పెద్ద వినాయక విగ్రహం వుంది. ఈ వినాయకుడు నెల్లూరు జిల్లాలో అతి పెద్ద విగ్రహంగా ప్రతీతి. ఆలయం వెనుక వున్న కోనేరులో తెప్పోత్సవం నిర్వహిస్తుంటారు. 2008లో రాజగోపురం పునర్నిర్మాణం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలో 14 అడుగుల శివుని విగ్రహం కూడా వుంది. ఈ ఆలయ ప్రాంగణంలో జ్యోతిర్లింగాలు, అష్టాదశ పీఠాల మండపం, దత్తాత్రేయ స్వామి కూడా వున్నారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘమాసం శుద్ధ నవమి రోజున అంకురార్పణ మహోత్సవం ప్రారంభమై దశమి రోజున ధ్వజారోహణం జరుగుతుంది. ద్వాదశి రోజున శేషవాహనం, చతుర్దశి రోజున రాత్రి 10 గంటలకు లింగోద్భవ అభిషేకం, రెండు గంటలకు నందిసేవ, తదుపరి రోజున కళ్యాణోత్సవం, పాడ్యమి రోజున రథోత్సవం కన్నుల పండువుగా జరుగుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com