మంగళగిరిలో లాక్ డౌన్ ఏప్రిల్ 30 వరకు.... !

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 10, 2020, 04:46 PM
 

ఏపీ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి . అయితే గుంటూరు జిల్లాలోని మంగళగిరి పట్టణంలో రెండు పాజిటివ్ కేసులు నమోదుకావడంతో ఈ ప్రాంతమంతా రెడ్ జోన్‌గా ప్రకటించారు. రెడ్ జోన్‌కి మూడు కిలోమీటర్ల చుట్టూ ఉన్న ప్రాంతమంతా లాక్ డౌన్‌లొనే ఉంటుంది. మంగళగిరిలో మార్చి నెలాఖరున మొదటి కేసు నమోదైంది. ఏప్రిల్ నెల రెండవ తేదీన మొదటి కేసు వ్యక్తి భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒక పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతంలో 28 రోజులు లాక్ డౌన్ కొనసాగుతుందని... అంటే ఏప్రిల్ నెల రెండవ తేదీన రెండవ పాజిటివ్ కేసు నమోదుకావడంతో ఏప్రిల్ నెల 30 వతేదీ వరకు మంగళగిరిలో లాక్‌డౌన్ కొనసాగుతుందని పట్టణ సిఐ శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం వివరణ ఇచ్చారు. ఈ సమయంలో మరికొన్ని పాజిటివ్ కేసులో ఈ ప్రాంతంలో నమోదైతే లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఏప్రిల్ 14తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్‌ను ఎత్తేసినా... మంగళగిరి ప్రాంతంలో లాక్ డౌన్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. కరోనా వృద్ధి చెందకుండా ఉండేందుకు ప్రజలెవరు బయటకు రావద్దని అత్యవసరంగా రావలసి వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పట్టణ సిఐ సూచించారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో ఇప్పటికే 50 కరోనా కేసులు వెలుగు చూడగా... ఈ వైరస్ కారణంగా ఒకరు మృత్యువాతపడ్డారు.