ఈఎంఐ పేరుతో మోసం.. కస్టమర్లు జాగ్రత్త

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 10, 2020, 03:02 PM
 

లాక్ డౌన్ వ్యవధిలో ఈఎంఐల భారాన్ని తగ్గించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చి 31 నుంచి మే 31 మధ్య అన్ని రకాల చెల్లింపులు, రుణాలు మరియు క్రెడిట్ కార్డుల బిల్లులపై మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది. వినియోగదారులు బ్యాంక్ ప్రతినిధులతో దీని గురించి మాట్లాడటం చాలా సహజం. అయితే కొంతమంది మోసగాళ్ళు కస్టమర్లను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కొత్త కుంభకోణం గురించి హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బీఐ మరియు ఇతరులతో సహా భారతదేశంలోని ప్రధాన బ్యాంకులు పౌరులను హెచ్చరిస్తున్నాయి. అయితే ఈఎంఐ మారటోరియం కుంభకోణం ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకులు తమ వినియోగదారులకు లోన్లు, క్రెడిట్ కార్డుల పేమెంట్ లకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఇదే అవకాశంగా తీసుకుని సైబర్ మోసగాళ్లు ఈఎంఐల మారటోరియం సేవల పేరుతో అకౌంట్ ల నుంచి డబ్బులులాగే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో అకౌంట్ హోల్డర్స్ ను ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అప్రమత్తం చేస్తున్నాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. సైబర్ నేరగాళ్ల మోసాలు ఎలా సాగుతున్నాయంటే పేమెంట్స్ ను వాయిదా వేయించేందుకు సహాయం అందిస్తామని కొందరు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తారు. అకౌంట్ వివరాలతో పాటు ఓటిపి, సివివి , పాస్ వర్డ్ లేదా పిన్ నెంబర్ అడుగుతారు. ఒక వేళ సైబర్ మోసగాళ్లకు ఈ వివరాలు అందిస్తే మీ ఖాతాలు ఖాళీ అవుతాయి. కాబట్టి అకౌంట్స్ ,కార్డుల వివరాలు చెప్పే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి ఫోన్ కాల్స్ కు, మెసేజ్ లకు ఎవరూ స్పందించవద్దని బ్యాంకులు సూచిస్తున్నాయి.