లాక్డౌన్ ఉన్నన్ని రోజులు డబ్బులకు కాస్త ఇబ్బందులు తప్పవు. ఇటువంటి సమయంలో అసలు క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టేందుకు డబ్బులు లేవా? ఈ పరిస్థితి మీకే కాదు. చాలామందిదీ ఇదే సమస్య. అలాగని క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే డిఫాల్టర్ లిస్ట్‌లోకి వెళ్తారు. మళ్లీ అది కాస్తా క్రెడిట్ స్కోర్ పైనా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎప్పుడూ క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకుండా ఆపొద్దు. అయితే డబ్బులు లేనప్పుడు బిల్లులు చెల్లించడం ఎలా? ఈ సందేహం క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఉండటం మామూలే. అందుకోసం కొన్ని మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ క్రెడిట్ కార్డు బిల్లుల్ని చెల్లించడానికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఓ మార్గం. మీ దగ్గర ఇంకో క్రెడిట్ కార్డు ఉంటే ఆ కార్డు నుంచి మీరు బిల్లు చెల్లించాలనుకునే కార్డుకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీని వల్ల మీరు గరిష్టంగా 90 రోజుల వరకు క్రెడిట్ ఫ్రీ పీరియడ్ వాడుకోవచ్చు. మీరు డబ్బులు అడ్జెస్ట్ చేసుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లుల్ని చెల్లించేందుకు స్నోబాల్ టెక్నిక్ ఫాలో కావొచ్చు. మీకు బిల్లులు ఎక్కువగా ఉంటే ఒకదాని తర్వాత ఒకటి చెల్లిస్తూ భారాన్ని తగ్గించుకోవాలి. ముందు తక్కువ బిల్లు ఉన్న కార్డు పేమెంట్ క్లియర్ చేయాలి. ఆ తర్వాత ఎక్కువ బిల్లుపై దృష్టి పెట్టాలి. ఇలా ఒక కార్డుపై బిల్లు చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ కాస్త పెరుగుతుంది. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కూడా ఎక్కువవుతుంది. తప్పదు అనుకుంటే మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేందుకు పర్సనల్ లోన్ తీసుకోండి. ఎందుకంటే క్రెడిట్ కార్డుపై చెల్లించే వడ్డీ కన్నా పర్సనల్ లోన్ వడ్డీ చాలా తక్కువ. క్రెడిట్ కార్డుకు వడ్డీ చెల్లించడం కన్నా పర్సనల్ లోన్ తీసుకోవడమే మంచిది. మీరు ఇప్పటికే ఏదైనా హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఈఎంఐలు చెల్లిస్తున్నట్టైతే టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు. మీరు గతంలో ఈఎంఐలు గడువులోగా చెల్లిస్తే టాప్ అప్ లోన్ సులువుగా దొరుకుతుంది. వడ్డీ రేట్లు కూడా మీరు గతంలో ఎంత చెల్లిస్తున్నారో అంతే ఉంటాయి. మీరు ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టైతే వాటిని లిక్విడేట్ చేసి క్రెడిట్ కార్డు బిల్లుల్ని చెల్లించండి. మీ ఇన్వెస్ట్మెంట్లపై వడ్డీ వస్తున్నా సరే తప్పని పరిస్థితుల్లో ఈ ఆప్షన్ తప్పదు. ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్లపై వచ్చే వడ్డీ కన్నా, క్రెడిట్ కార్డు వడ్డీ ఎక్కువ.