కరోనా పై సర్కార్ అలర్ట్ గా ఉందన్న సీఎం

  Written by : Suryaa Desk Updated: Thu, Mar 26, 2020, 07:08 PM
 

ఏపీ సీఎం జగన్ కరోనా పై అధికారులతో సమీక్షించారు. సమీక్షా సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే... "కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఏపీ ప్రజలకు ఢోకా ఏమి లేదు. ఎక్కడ ఉన్న వాళ్లు అక్కడ ఉండకపోతే ఈ వ్యాధిని కట్టడి చేయలేం. 3 వారాలు జాగ్రత్తగా ఉంటేనే ఈ వ్యాధిని అరికట్టగలం. 104 నంబర్ అందుబాటులో ఉంటుంది. ఎవరికి ఏం సహాయం కావాలన్నా ఈ నంబర్ ను సంప్రదించండి. అదే విధంగా 1902 హెల్ప్ లైన్ నంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉంచుతాం.ఏప్రిల్ 14 వరకు ఎక్కడి వారు అక్కడ ఉండాల్సిందే. మన వాళ్లను మనం ఆపే పరిస్థితి బాధాకరం. కానీ తప్పదు. కేసులు పెరగకుండా ఉండాలంటే స్వీయ క్రమశిక్షణ అవసరం. 4 చోట్ల క్రిటికల్ కేర్ ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. 213 వెంటిలేటర్లు ఏర్పాటు చేశాం. బార్డర్ దాకా వచ్చిన 44 మందిని క్వారంటైన్ లో ఉంచాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా హెల్ప్ లైన్ నంబర్ 1902కి ఫోన్ చేయండి. ఆహారానికి ఇబ్బంది ఉన్నా,ఉండటానికి ఇబ్బంది ఉన్నా జిల్లా కలెక్టర్ నేరుగా రంగంలోకి దిగుతాడు. రాష్ట్రానికి 27 వేల మంది విదేశీయులు వచ్చారు. వారందరి పై నిఘా ఉంచాం. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించక తప్పదు. ఏప్రిల్ 14 వరకు ఎవరూ బయటికి రావద్దు. మార్చి 29నుంచి బియ్యం,పప్పు పంపిణీ చేస్తాం. ఏప్రిల్ 4న డోర్ డెలీవరి ద్వారా ఇంటింటికి రూ.1000 పంపిణీ చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ సర్వే చెయ్యమని వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఫారీన్ రిటర్న్లు ఉంటే గుర్తించి, వారిని పరీక్షలు చెయ్యాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ముగ్గురు మంత్రులు, సీఎం ఆఫీసు సిబ్బంది, కలెక్టర్లు, వైద్యారోగ్య సిబ్బంది 24/7 అందుబాటులో ఉన్నారు. నిత్యావసర వస్తువుల వాహనాలకు ఇప్పటికే అనుమతులు ఇచ్చాం. వస్తువుల కొరత రానివ్వం. ప్రతి 2, 3 కిలోమీటర్ల పరిధిలోకి రైతుబజార్లు అందుబాటులోకి తెచ్చాం. ఉదయం 6 నుండి 1 వరకు బయటకు రండి. అనవసరంగా బయట తిరగవద్దు. గ్రామాల్లో రైతులు తప్పని పరిస్థితుల్లోనే బయటకి రండి. 1-2 మీటర్ల దూరం పాటించండి. గ్రామాల్లో పారిశుధ్య పనుల పై పంచాయతీరాజ్ శాఖ దృష్టి పెట్టాలని, నగరాల్లో మునిసిపల్ అధికారులను ఆదేశించాము. పోలీసులు, డాక్టర్లు, నర్సులు చాలా శ్రద్ధతో సేవాలందిస్తున్నారు.బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. వారందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణాలో ఉన్న ఏపీ ప్రజల సంక్షేమం తెలంగాణా సీఎం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందకండి." అని సీఎం జగన్ అన్నారు.