13 చోట్ల ఒకే వ్యక్తికి ఓటుహక్కు

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 22, 2020, 02:37 PM
 

ఏలూరు నగర పాలక సంస్థ తాజాగా ముద్రించిన ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీల నాయకుల సైతం నగర పాలక సంస్థ తీరును ఎండగడుతున్నారు. ఎవరినీ సంప్రదించకుండా ఓటర్ల జాబితా విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సాక్షాత్తు హైకోర్టు ఈ ఓటర్ల జాబితాపై తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చింది. ఇంత నిర్లక్ష్యంగా ఎలా జాబితాను తయారు చేశారంటూ ఎన్నికల కమిషన్‌ను నిలదీసింది. వివరాల్లోకి వెళితే నగర పాలక సంస్థ ఓటర్ల జాబితా పూర్తి లోపభూయిష్టంగా తయారైంది. ఒక వార్డులో ఒకే వ్యక్తి ఏకంగా 13 చోట్ల ఓటుహక్కు కల్పించారు. పూర్ణ వెంకట సాయిమహేష్‌ అనే వ్యక్తికి సీరియల్‌ నంబర్‌ 3,699 నుంచి 3,712 వరకు 13 చోట్ల ఓటుహక్కు కల్పించారు. అదే విధంగా మరో వ్యక్తికి ఏడు చోట్ల, చనిపోయిన వ్యక్తులను ఓటర్ల జాబితాలో చేర్చడం విమర్శలకు తావిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే కుక్కకు కూడా ఓటుహక్కు రావడం ఈ జాబితా తయారీలో చోటు చేసుకున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇదిలా ఉండగా ఈ జాబితాను మార్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నగరానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయమూర్తి పరిశీలించి దీనిపై విచారణ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.