వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై వైసీపీ, టీడీపీ మాటలయుద్ధం.. అసలు నిజాలివే..

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 22, 2020, 12:36 PM
 

ఆంధ్రప్రదేశ్ లోని వెలిగొండ ప్రాజెక్టు (పూలసుబ్బయ్య ప్రాజెక్టు) పనుల పురోగతి, ఎవరి హయాంలో ఎంతశాతం పూర్తి చేశారు. అందులో అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా గత ఏడాది కాలంలో జరిగిన పనులు, వాటిలో చోటుచేసుకున్న అవినీతి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, అంచనాల సవరణ, అవినీతి ఆరోపణల్లో నిజమెంతో మీరే చూడండి..
ఏపీలోని ప్రకాశం జిల్లాలో 4.6 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మంది ఫ్లోరైడ్, కరవు బాధిత ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో పురుడు పోసుకున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు 2005 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయి. అఫ్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. 18.8 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగాలను తవ్వి 43.5 టీఎంసీల కృష్ణానది వరద నీటిని శ్రీశైలం రిజర్వాయర్ పరిధిలోని నల్లమల సాగర్ రిజర్వాయర్ కు తరలించడం దీని లక్ష్యం. దీని ప్రకారం మొదటి సొరంగం పనులను 2018 ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని గడువు పెట్టిన ప్రభుత్వం... సాబిర్ స్యూ అండ్ జేవీ ప్రసాద్ సంస్ధకు పనులను అప్పగించింది. ఈ సొరంగం తవ్వకం, ఇతర పనుల కోసం 626.60 కోట్లు కేటాయిస్తూ 2005 ఆగస్టు 20న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రెండో సొరంగం పనుల కోసం హెచ్.సి.సి. సంస్ధకు కాంట్రాక్టు అప్పగిస్తూ 735 కోట్ల విడుదలకు ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే 2019 మే 31 లోగా పూర్తి చేయాలని గడువు విధించింది. కానీ నిర్ణీత సమయంలో పనులు పూర్తి కాలేదు. ఆలోగా వైఎస్ మరణం, ప్రభుత్వాలు మారిపోవడంతో వెలిగొండ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.
ఆ తర్వాత 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు పనులు మరో ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించారు. 2017 డిసెంబర్ 20న ప్రభుత్వం ముందుకు కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. 2018 మార్చి 22న మొదటి సొరంగంలో 15.2 కి.మీ నుంచి 18.8 కిలోమీటర్ల వరకూ పనులు మిగిలి ఉన్నట్లు గుర్తించారు. వీటిని పూర్తి చేయాలంటే 116.447 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. చివరికి సవరించిన అంచనాల ప్రకారం 292.15 కోట్లు విడుదల చేస్తూ టీడీపీ సర్కారు 2018లో ఉత్తర్వులు ఇచ్చింది.. అంటే మొదటి సొరంగంలో కేవలం 3.6 కిలోమీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నట్లు తేలింది. రెండో సొరంగంలో 10.7 కిలోమీటర్ల నుంచి 18.7కిలోమీటర్ల వరకూ పనులు మిగిలి ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిని పూర్తి చేసేందుకు 299.48 కోట్ల నుంచి 720.26 కోట్లకు అంచనాలు పెంచుతూ నిధుల విడుదలకు అనుమతించింది. అంటే రెండో సొరంగంలో 8 కిలోమీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నట్లు లెక్కించారు.. 2018 ఆగస్టులో మొదలైన పనులు నత్తనడకన సాగుతున్నాయి. సాంకేతిక ఇబ్బందుల వల్ల టీడీపీ హయాంలో పనులు ఆలస్యమైనట్లు అధికారులు కూడా చెబుతున్నారు.
తిరిగి 2019 జూన్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై సమీక్షలు జరిపి పనుల వేగం పెంచింది. చివరికి తాజాగా వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి పరిశీలించడానికి సీఎం జగన్ పర్యటించిన సందర్భంగా అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం పనులు తిరిగి ప్రారంభమైన 2018ఆగస్టు నుంచి ఇప్పటివరకూ మొదటి సొరంగం 2 కిలోమీటర్లు, రెండో సొరంగం 600 మీటర్లు మాత్రమే పూర్తయ్యాయి. మొదటి సొరంగం పనుల్లో జరిగిన రెండు కిలోమీటర్ల పనుల్లో 1.4 కిలోమీటర్ల మేర పనులు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగాయని అధికారులు తాజాగా నివేదించారు. అంటే అంతకుముందు టీడీపీ హయాంలో కేవలం 600 మీటర్లు మాత్రమే జరిగినట్లు. ఇప్పుడు దీనిమీదే అధికార, విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి.
అంటే టీడీపీ హయాంలో సవరించిన అంచనాల ప్రకారం కొత్త ఏజెన్సీలకు పనులు అప్పగించే నాటికి మొదటి సొరంగంలో 80 శాతం, రెండో సొరంగంలో 57 శాతం పనులు పూర్తయినట్లు అర్ధమవుతోంది. తాజాగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపిన వివరాలను బట్టి చూస్తే మొదటి సొరంగం పనులు మరో రెండు కిలోమీటర్లు పూర్తి చేసుకుని 94 శాతానికి చేరాయి. అలాగే రెండో సొరంగం పనులు ఇరు ప్రభుత్వాల హయాంలో కలిపి కేవలం 600 మీటర్లు అంటే 60 శాతం మాత్రమే పూర్తయినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ మొత్తం వివరాలను క్రోడీకరిస్తే టీడీపీ హయాంలో వెలిగొండ ప్రాజెక్టులో మొదటి టన్నెల్ పనులు 600 మీటర్లు మాత్రమే పూర్తికావడం వాస్తవమే అని తెలుస్తోంది. అయితే ఇందుకు కారణం సాంకేతిక కారణాలే అని అధికారులు చెబుతున్నారు. అయితే వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా అంచనాల పెంపులో 414 కోట్ల అవినీతి ఆరోపణలు మాత్రం నిర్ధారణ కాలేదు.