ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు జాతీయ బాలికా దినోత్సవం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2020, 12:49 PM

దేశంలో చిన్నారులపై నిత్యం లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మన దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక చిన్నారి లైంగిక దాడికి గురవుతోందని 'చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యు' (సి.ఆర్‌.వై) సంస్థ తెలిపింది. గత పదేళ్లలో ఏకంగా 500కు పైగా దాడులు పెరిగాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. జీవితంలో 'బాల్యం' చాలా ముఖ్యమైంది. ఎందుకంటే చీకు, చింతా లేక హాయిగా, సంతోషంగా వుండడం బాల్యంలోనే సాధ్యం. అలాగే మంచి, చెడ్డా తేడా తెలియకుండా వుండడం కూడా బాల్యంలో భాగమే. ఆ వయసులో తమకు 'కష్టం' వస్తే రక్షణ ఉంటుందనే ధైర్యాన్ని కలిగివుంటారు. అయితే బాల్యంలోనే ముఖ్యంగా బాలికలు, వివిధ రకాల అసమానతలకు, అవమానాలకు, శారీరక, మానసిక వివక్షతకు గురవుతున్నారు. ఈ వివక్షత ఆ బాలిక మిగిలిన జీవితంపై ప్రభావం చూపుతుంది. ఆడపిల్లలు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎన్నో అవమానాలు, ఆంక్షలను ఎదుర్కొంటున్నారు. గత్యంతరం లేక జీవితాలను కొనసాగిస్తున్నారు. పరిష్కారం దొరకక, భరోసా లేక, ఆలోచనలు పంచుకోవడానికి ఆత్మీయులు లేక కొన్ని సందర్భాలలో 'ఆత్మహత్యే' పరిష్కారమని భావిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఆందోళన కలిగించే అంశాలు. వీటి పరిష్కారానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే 'స్త్రీ శిశు సంక్షేమ శాఖ' 2008 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 24న 'జాతీయ బాలికా దినోత్సవం'గా గుర్తించి వివిధ సమాజ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి మహిళ 'ప్రతిభా పాటిల్‌' పదవిలో వుండగా మొదటిసారిగా 2009 జనవరి 24న మొదటి 'జాతీయ బాలికా దినోత్సవ' వేడుకలకు అంకురార్పణ జరిగింది. అసమానతలను ఎదుర్కొంటున్న బాలికలకు భరోసా కల్పించడం, బాలికల హక్కులకు ప్రచారం కల్పించడం, బాలికలకు విద్య, ఆరోగ్యం, పోషకాహార ఆవశ్యకత గురించి బహుళ ప్రచారం కల్పించడం మొదలైనవి ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశాలు. విద్య, పోషకాహారం, బాల్య వివాహాలు, న్యాయపరమైన చిక్కులు, వైద్యం, రక్షణ, గౌరవం, అసమానతలు, లింగ నిర్ధారణ, అత్యాచారాలు, వేధింపులు, అక్రమ రవాణా, హత్యలు వంటి సమస్యలతో మన దేశంలో బాలికలు సతమతమవుతున్నారు. ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం 2009లో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం తీసుకువచ్చింది. 2012లో 'చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం' (పోక్సో చట్టం) తెచ్చి 18 ఏళ్ల లోపు వారిని బాలలుగా గుర్తించింది. ఆడపిల్లలను రక్షించి, చదువుకోవాల్సిన అవసరం గురించి, సాధికారత లిఖించేందుకు 2015లో 'బేటీ బచావో, బేటీ పఢావో' కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 'దిశ' చట్టాన్ని తెచ్చింది. అమలుకి కార్యాచరణ నిర్ణయించి చర్యలు తీసుకొంటానంటోంది. అయితే అందుకవసరమైన నిధులు కేటాయించాలి. బాలికల సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటై నిబద్ధతతో పని చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com