ఇది ఒక దుర్మార్గపు పాలన... : కేశినేని నాని

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 20, 2020, 08:30 PM
 

ఇది ఒక దుర్మార్గపు పాలన అని, ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా ప్రవర్తిస్తే మట్టికరుస్తారని సీఎం జగన్ ని టీడీపీ ఎంపీ కేశినేని నాని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాన్ని చాలా మంది ముఖ్యమంత్రులు పాలించారుగానీ ఇప్పుడున్న నిరంకుశ పాలన, ఫ్యాక్షనిస్టు పాలన ఎన్నడూ లేదని దుమ్మెత్తి పోశారు. ఎన్నికల్లో గెలిచాం కదా అని ఇష్టానుసారం ప్రవర్తిస్తే ప్రజలు ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు చెబుతారంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శాంతియుతంగా చేస్తున్న రైతు ఉద్యమాలను అణగదొక్కడం సమంజసం కాదని హెచ్చరించారు.


రైతులను, ప్రతిపక్ష నేతలను, మేథావులను అరెస్టు చేయడం తగదని, ఒక ఎంపీని అయిన తనను ఏవిధంగా హౌస్ అరెస్ట్ చేస్తారు? అని ప్రశ్నించారు. తన విధులు నిర్వర్తించకుండా చేయడం నేరం అని పోలీసులపై మండిపడ్డారు. రాష్ట్రానికి మంచి చేయాలన్న తలంపుతో ప్రభుత్వం పనిచేయాలే తప్ప కుల, మత ప్రాతిపదికగా పనిచేయడం కరెక్టు కాదని అన్నారు. ఏ ప్రాంతం వారైనా తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటారని, నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు నిర్వహించిన ర్యాలీ ఇందుకు భిన్నంగా ఉందని, ప్రజాప్రతినిధులు సిగ్గుపడేలా ఉందని మండిపడ్డారు. అమరావతిలో అభివృద్ధి వద్దని, ఆ అభివృద్ధిని విశాఖ, కర్నూలులో చేయాలని కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా, రాజధాని మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేశినేని నాని డిమాండ్ చేశారు.