వైస్ రాజశేఖర్ రెడ్డి గారిలా మరణించాలని ఉంది : కొడాలి నాని

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 20, 2020, 07:08 PM
 

సోషల్ మీడియాలో, టీవీల్లో దివంగత వైఎస్సార్ ను, కుటుంబ సభ్యులను, సీఎం జగన్ ను కొంతమంది బూతులు తిట్టిస్తున్నారని కొడాలి నాని ధ్వజమెత్తారు.  ఈ రోజు నాని అసెంబ్లీ లో మూడు రాజధానులపై ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం గురించి కూడా కొంతమంది అసంబద్ధంగా మాట్లాడుతున్నారన్నారు. వైఎస్సార్ లాంటి మరణం తనకు వస్తే.. లేదా దేవుడు అడిగితే.. తనకు ఆ మరణం కావాలని కోరుకుంటానని నాని చెప్పారు. పుట్టిన ప్రతీ ఒక్కరు మరణిస్తారంటూ.. వైఎస్సార్ చనిపోయినా బ్రతికున్నారని పేర్కొన్నారు. అలాంటి అదృష్టం అందరికి రాదన్నారు.


వైఎస్సార్ మరణించినప్పటికీ.. ప్రజల గుండెల్లో బ్రతికున్న దేవుడు రాజశేఖర్ రెడ్డని నాని చెప్పారు. అటువంటి రాజశేఖర్ రెడ్డిని గురించి తప్పుగా మాట్లాడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఆయన మరణించిన తర్వాత వైసీపీ స్థాపించిన జగన్ ను కడపలో ఐదు లక్షల నలబై అయిదువేల మెజారిటీతో ప్రజలు గెలిపించారన్నారు. అధికారంలో ఉన్న టీడీపీకి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు.  పార్టీ స్థాపన తర్వాత తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 67మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారన్నారు. రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి జగన్ ను సీఎం చేశారన్నారు.


ఈ విజయాలు వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకున్న ప్రజలు ఇచ్చినవే అని చెప్పారు.  వైఎస్సార్ మరణంపై తప్పుడు ప్రేలాపనలు చేసే వారికి చెప్పేదొక్కటేనంటూ.. తనకు ఆయనలాగా పేరు ప్రఖ్యాతులొచ్చి.. తన పిల్లలకు ఉన్నతమైన స్థానాలకు చేరుతారంటే తాను వైఎస్సార్ మరణాన్ని కోరుకుంటానని వ్యాఖ్యానించారు.