టీడీపీ మాట మార్చే రోజు వస్తుంది : అంబటి రాంబాబు

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 20, 2020, 07:00 PM
 

మూడు రాజధానులే ముద్దు అంటూ వైసీపీ, అమరావతి కావాలని టీడీపీ... అసెంబ్లీ సమావేశాల ప్రారంభదినం నాడు సభలో అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధాలు నడిచాయి. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సభలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అమరావతి కోసం 24 మంది రైతులు చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. గుంటూరులో ఉన్న నాకే ఆ విషయం తెలియదు. అంతా అసత్య ప్రచారమే" అంటూ మండిపడ్డారు. టీడీపీ మాట మార్చే రోజు వస్తుందని, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మేం ఎప్పుడు వద్దన్నాం అంటూ మరో మాట చెప్పడం ఖాయమని అన్నారు. గతంలో ఇంగ్లీషు మీడియం విషయంలోనూ ఇలాగే వ్యవహరించి, ఆ తర్వాత మేమెప్పుడు వద్దన్నామంటూ టీడీపీ నేతలు మాట మార్చారని ఆరోపించారు. మాది తుగ్లక్ ప్రభుత్వం అంటున్నారు, ఉమ్మడి రాజధాని వదిలేసి వచ్చిన మీది తుగ్లక్ పాలనా కాదా? అని ప్రశ్నించారు.