21 మంది ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామాలు చేసి... : కొడాలి నాని

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 20, 2020, 06:23 PM
 

మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, వైసీపీ ఎమ్మెల్యేలు 151 మంది రాజీనామా చేయాలని టీడీపీ నేతలు తరచుగా వ్యాఖ్యలు చేస్తుంటారని, అసలు, ‘ఇదేమీ విచిత్ర వాదమో ఎవడికి అర్థం కాదు’ అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. అసెంబ్లీలో ఇవాళ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గురించి ప్రస్తావించారు. తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో లేదని అప్పటి ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ చెబితే నాడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ మళ్లీ పోటీ చేసి గెలిచారని, ఆ సెంటిమెంట్ ఉందని నిరూపించారని గుర్తుచేశారు. జగన్మోహన్ రెడ్డికి రాజీనామాలు చేయడమేమి కొత్త కాదని, వైసీపీ స్థాపించినప్పుడు ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని ప్రజలు భావిస్తున్నారన్న నమ్మకం టీడీపీ ఎమ్మెల్యేలకు కనుక ఉంటే, ఆ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామాలు చేసి, తిరిగి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. నాడు కేసీఆర్, జగన్ తమ పదవులకు రాజీనామా చేసినట్టుగా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని అన్నారు.