చంద్రబాబు పై సెటైర్లు వేసిన కొడాలి నాని

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 20, 2020, 05:14 PM
 

గత ప్రభుత్వం మాదిరి ప్రజలను భ్రమల్లో, భ్రాంతుల్లో, ఆకాశంలో విహరించకుండా, వాస్తవ పరిస్థితులను ప్రజానీకానికి తెలియజేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఏపీ అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లు రద్దుపై చర్చ సందర్భంగా కొడాలి మాట్లాడుతూ, ఏపీలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటున్నట్టు జగన్ చెప్పడం అభినందనీయమని ప్రశంసించారు.


రాష్ట్రానికి కరెక్టుగా మధ్యలో అమరావతి ఉందని, టేపు పెట్టి కొలిస్తే ఇక్కడికి వచ్చిందని చెబుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సెటైర్లు వేశారు. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం సబబు కాదని అన్నారు. రాజధాని మధ్యలో ఉందా? చివర్లో ఉందా? అని ఎవరూ చూడరని అన్నారు. చంద్రబాబు చెప్పినట్టుగా ఆయన చెప్పిన మహానగరాలతో పోటీ పడేలా రాజధాని ఉండాలే తప్ప  రాష్ట్రానికి మధ్యలోనో, చివర్లోనో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.