విపక్ష పార్టీలు చేస్తోన్న ప్రకటనలపై స్పందించిన స్పీకర్

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 19, 2020, 07:03 PM
 

అసెంబ్లీని ముట్టడిస్తాం అంటూ విపక్ష పార్టీలు చేస్తోన్న ప్రకటనలపై రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అసెంబ్లీని ముట్టడిస్తాం.. కట్టడిచేస్తాం అంటే నడవదని స్పష్టం చేశారు. చట్ట సభలను అడ్డుకోవడం, ముట్టడి కార్యక్రమాలు చేపట్టడం అనేది సభా హక్కుల, రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించారు. చట్ట సభల్లోకి అగంతకులు ప్రవేశించకూడదనే నియమాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. నిరసనలు తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే ఆ నిరసనలు చట్టాలకు లోబడే ఉండాలని సూచించారు. ముట్టడిస్తాం.. కట్టడి చేస్తాం అంటూ చట్ట సభలకే హెచ్చరికలు చేస్తున్నారని, ఈ పద్దతి సరికాదని విపక్ష పార్టీలకు స్పీకర్ సీతారాం హితవుచెప్పారు.