ఈ ఘటన నన్ను తీవ్రంగా బాధించింది: నారా లోకేష్

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 15, 2019, 01:30 PM
 

ఓ ఘటన తనను తీవ్రంగా బాధించిందంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలంలో మతి స్థిమితంలేని యువతిపై మద్యం మత్తులో ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన విషయం తెలిసిందే.


దీనిపై లోకేశ్ స్పందిస్త్తూ .. 'జీవం పొసే 'ఆమె'కు జీవించే హక్కుని హరిస్తున్నారు మృగాళ్లు. ప్రతి రోజు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దిశ  బిల్లు ఆమోదం పొందిన రోజు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో యువతి పై కామంతో మదమెక్కిన ఓ ఉన్మాది అత్యాచారానికి పాల్పడ్డాడు' అని పేర్కొన్నారు.


'ఈ ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. దిశ చట్టం పై ప్రజల్లో అవగాహన పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొత్త చట్టం ప్రకారం త్రిపురాంతకం ఘటన నిందితుడికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా చూసి బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.


దిశ బిల్లుని శాసనసభలో ఆమోదించిన రోజే గుంటూరులో ఐదేళ్ల బాలిక పై మృగాడు లక్ష్మణ్ రెడ్డి అత్యాచారానికి పాల్పడిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసిందని లోకేశ్ నిన్న కూడా ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.