ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళకు సమాన‌త్వానికి ప్ర‌తీక‌- ఇస్లాం ధర్మం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2019, 08:28 AM

స్త్రీ జాతికి సముచిత స్థానాన్ని ఇస్లాం ధర్మం కల్పించింది. మానవ సమానత్వం విషయంలో పురుషులతోపాటు స్ర్తిలకు కూడా ఇస్లాం సమాన హోదాను ప్రసాదించింది. పురుషులకు మహిళలపై ఎలాంటి హక్కులు ఉన్నాయో అలాంటి హక్కులే ధర్మప్రకారం మహిళలకు మగవారిపై ఉన్నాయి.ఇస్లామియా దృక్పథం ప్రకారం ‘తల్లి పాదాల క్రింది స్వర్గముందని, ఆమెను సేవించమని’ చాటి చెప్పిన ధర్మం ఇస్లాం. ఈ క్రమంలో ఇస్లాం స్ర్తికి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది.అలాగే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆడపిల్లను పుట్టీ పుట్టగానే సజీవంగా సమాధి చేసేవారు. జన్మనిచ్చినవారే ఈ పాపానికి ఒడిగట్టేవారు. మహాప్రవక్త ఆ సంస్కృతిని అడ్డుకుని ఆడపిల్లల సంరక్షణకై ఆ సంస్కృతిని అడ్డుకుని ఆడపిల్లల సంరక్షణకై సమాజాన్ని సంస్కరించడం జరిగింది. శిశుహత్య మహాపాతకమని, మానవత్వానికి మాయని మచ్చని, ఆ దైవం దీనిని క్షమించడని మహాప్రవక్త హెచ్చరించడం జరిగింది. ఆడపిల్లలు స్వర్గ ప్రవేశానికి మార్గం సుగమమం చేస్తారని, వారికి మంచి శిక్షణ ఇచ్చి వివాహాలు జరిపితే స్వర్గం ప్రాప్తిస్తుందని సెలవిచ్చారు. అలాగే విద్యా సముపార్జనలో కూడా స్ర్తి పురుషులకు సమానంగా విద్యా హక్కులు కల్పించడం జరిగింది. విద్య అభ్యసించడానికి పురుషులతో సమానంగా స్ర్తిలకు కూడా హక్కును కలిగించడం జరిగింది. ఆ కాలంలోనే ఎంతోమంది మహిళలు విద్యలను అభ్యసించి పండితులుగా విరాజిల్లారు.యుద్ధ మైదానంలో కూడా స్ర్తిలు పాల్గొనడం జరిగింది. పరదాలో వుంటూనే ఆ కాలంలో స్ర్తిలు యుద్ధ మైదానంలో గాయపడినవారికి వైద్య సహాయం అందించేవారు. మహిళలు యుద్ధరంగంలో తమ వంతు పాత్రను నిర్వహించడం జరిగిందంటే మహిళ తన పరిధిలోనే వుంటూనే తాను అవసరమైతే కరవాలాన్ని కూడా చేతబట్టుకుని యుద్ధరంగంలో తన శక్తిని నిరూపించగలగడం విశేషం.ఇస్లాం స్ర్తి శక్తిని గుర్తించి అపారమైన గౌరవ మర్యాదలను ఆపాదించింది. ఆస్తిలో హక్కును కలిగి ఉండడంఇస్లాం మహిళలకు ఆస్తి హక్కును కూడా కల్పించడం జరిగింది. ఇస్లాం ధర్మం ప్రకారం ఆస్తిలో భాగం ఉంది. అది ఆమె జన్మహక్కుగా పరిగణించబడింది. ఆమె తన తండ్రి ఆస్తినుంచి, తన భర్త ఆస్తినుండి, తన సంతానం యొక్క ఆస్తినుండి సర్వాధికారాలు కలిగి ఉంది. ఆమె తన స్వంత ఆస్తిని కలిగి ఉండవచ్చును.


వితంతు వివాహాలను ప్రోత్సహించడం: మహాప్రవక్త కాలంలో వితంతు వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. అలాగే తలాక్ పొందిన స్ర్తిలకు కూడా పునర్వివాహానికై ప్రోత్సహించడం జరిగింది. వితంతువులు, తలాక్ పొందిన స్ర్తిలు ఇంటికే పరిమితమైపోయి వారి జీవితాలు చీకటిపాలు కాకూడదని భావించి, వారి జీవితాలలో వెలుగు ప్రసరించాలనే ఉద్దేశ్యంతో పునర్వివాహాలను జరిపించడం జరిగింది. మహిళలకు ‘ఖులా’ లేదా విడాకుల హక్కును కల్పించటం. చాలామంది ఇస్లాంలో స్ర్తిలకు భర్తకు విడాకులు ఇచ్చే హక్కు లేదని పొరబడుతుంటారు. ఆమె చచ్చినట్టు దుర్మార్గుడైన భర్తతో లేదా ఇష్టంలేని వ్యక్తితో కాపురం చెయ్యాల్సి వుంటుందని భావిస్తుంటారు. కాని ఇస్లాంలో ఎప్పుడో అటువంటి భర్తతో అయిష్టంగా కాపురం చెయ్యాల్సిన దుస్థితినుండి విముక్తిని కలిగించడానికి ‘ఖులా’ రూపంలో పరిష్కరించగలిగింది. అలా స్ర్తికి ఎంతో గౌరవస్థానాన్ని ఆపాదించింది. స్ర్తిలను గౌరవ భావంతో చూడమని, వారిని ఆదరించమని అల్లాహ్ ఆజ్ఞాపించాడు.


వివాహ సమయంలో కూడా స్వేచ్ఛ: వివాహ సమయంలో కూడా ఆమె అంగీకారంతోనే నికాహ్ తంతును జరిపిస్తారు. ఇద్దరు సాక్షుల నడుమ ఆమె అంగీకారం తెలిపినట్టు సదరు ‘నికాహ్ నామా’లో (రిజిస్టర్డ్ బుక్లాంటిది) సంతకం పెట్టిన తరువాతనే వివాహ తంతు ముందుకు నడుస్తుంది. మగపెళ్లివారు నిర్ణీత పైకాన్ని ‘మెహర్’ను చెల్లిస్తారు. అది ఆమె స్వంతం. ఆమె యిష్టపూర్వకంగానే ఖర్చుపెట్టుకోవచ్చును. మెహర్ ఒక కానుక. ఒక బహుమానం. అది నికాహ్ ప్రాముఖ్యతను స్ర్తిజాతికి గౌరవాన్ని కలిగించే చిహ్నంగా చెప్పవచ్చును. ఇలా మొత్తంగా పరిశీలిస్తే ఇస్లాం స్ర్తిజాతికి అన్ని రంగాల్లో సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించింది. మహమ్మద్ ప్రవక్త కాలంలో మహిళలు వ్యాపార రంగంలో కూడా రాణించారడానికి నిదర్శనం బీబీ ఖదీజాగారు. ఆమె చేస్తున్న వ్యాపారాన్ని మహాప్రవక్త పర్యవేక్షించేవారు.మగవారికి మహిళలపై ఎలాంటి హక్కులు ఉన్నాయో, అలాంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకూ మగవారిపై ఉన్నాయి అని ఖురాన్లో ప్రవచించడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com