ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు సభకు వ‌స్తే బాగుండేది...కానీ: సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2019, 06:47 PM

ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల నియామకంపై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. అయితే ఈ చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు సభలో  లేకపోవడం దురదృష్టకరమని...ఆయన ఈ చర్చలో పాల్గొనాలని మనస్పూర్తిగా కోరుకున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఇలాంటి కీలకమైన విషయాలపై చర్చలో ఆయన పాల్గొంటారని ఆశగా ఎదురుచూశామని  అన్నారు. చంద్రబాబు సభకు వస్తారని భావించే ఎక్కువ సమయం కూడా ఇచ్చామన్నారు. కానీ తన ధోరణి మారదు అన్నట్టుగానే చంద్రబాబు వ్యవహరించారని... ఆయన రాలేదంటే ప్రతిపక్ష పాత్ర సమర్ధవంతంగా పోషించనట్లేనని జగన్ అన్నారు.
ఇక జగన్ సబ్జెక్ట్ పై మాట్లాడుతూ... వాలంటీర్లు, సచివాలయాల ఏర్పాటుతో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలోపే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు కల్పించడమన్నది దేశచరిత్రలో ఎప్పుడూ జరగలేదని తెలిపారు. అలాంటి ఘట్టం ఆంధ్రరాష్ట్రంలో జరిగిందన్నారు. అక్షరాల 1,28,858 మందికి అపాయింట్‌మెంట్లు ఇచ్చామన్నారు. వాళ్లంతా కూడా ఇవాళ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నారని జగన్ తెలిపారు.
11వేలకు పైగా గ్రామ  సచివాలయాలు, దాదాపు 3వేలకు పైగా వార్డు సచివాలయాలు అన్నీ కలిపి దాదాపు 15వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో 1,28,858 మంది పనిచేస్తున్నారని...ఈ నియామకం కోసం దాదాపు 8 రోజులపాటు 20 లక్షలమంది పరీక్షలు రాశారని తెలిపారు. చాలా పారదర్శకంగా ఈ పరీక్షలు జరిగాయని... ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించామన్నారు. అందుకు.అధికారులందరికీ కూడా హ్యాట్సాప్ చెప్తున్నాననిఅన్నారు.
సెక్రటరీల దగ్గరనుంచి జిల్లా కలెక్టర్ల వరకూ అలాగే పంచాయతీరాజ్‌ శాఖమంత్రి, మున్సిపాల్‌ శాఖమంత్రులనూ ఈ సందర్భంగా ప్రశంసిస్తున్నానని అన్నారు. దేశంలో కూడా ఎక్కడాలేని రీతిలో ఈ పరీక్షలు పారదర్శకంగా జరిగాయన్నారు. 1,28,858 ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 82.5శాతం ఉద్యోగాలు వచ్చాయంటే ఏ స్థాయిలో విప్లవాత్మక బాట ఏర్పడిందో చెప్పాల్సిన అసరంలేదన్నారు.  ఇందులొ 51.9 శాతం వాటా బీసీలదేనని తెలిపారు.
వీటికి అనుబంధంగా 2.65లక్షల పైచిలుకు గ్రామ వాలంటీర్లను నియమించామని తెలిపారు. ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించామని...వాళ్లు కూడా ఎక్కడా అవినీతికి పాల్పడకూడదనే ఉద్దేశంతో నెలకు రూ.5 వేలచొప్పున జీతాలు ఇస్తున్నామన్నారు. ఎక్కడైనా, ఎవరైనా పక్షపాతం చూపించినా, లంచాలు తీసుకున్నా తామిచ్చిన టోల్‌ఫ్రీ నంబర్‌ కు ఫోన్ చేయాలని... ఆ కాల్ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే కనెక్ట్‌ అయ్యేట్టుగా చేశామని  తెలిపారు.
ప్రతి యాభై ఇళ్లకు సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీకూడా నేరుగా డోర్‌డెలివరీ చేసే విధంగా ఈవ్యవస్థను రూపొందించామన్నారు. ప్రతి 2 వేల జనాభాకు గ్రామ సెక్రటేరియట్‌ను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. ఈ 2వేల జనాభాకు సంబంధించిన అన్ని అంశాలను గ్రామ సచివాలయం చూసుకుంటుందన్నారు.. ఈ  గ్రామ సెక్రటేరియట్ ప్రతి సేవను కూడా డోర్‌డెలివరీ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని సీఎం వెల్లడించారు.
''సంతృప్త స్థాయిలో ప్రతి ఒక్క లబ్ధిదారునికీ మంచి కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టాం.ఎవ్వరైనా, ఎక్కడైనా మిగిలిపోతే గ్రామ సచివాలయంలో ఆ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను అతికిస్తున్నాం. ఆ జాబితాలో లబ్ధిదారుల జాబితాను అతికించడమే కాకుండా, ఆ జాబితా పక్కనే అర్హతలు ఏంటి, ఎవరిపేరైనా మిస్‌ అయితే వాళ్లు ఎలా నమోదుచేసుకోవాలి అన్న విషయాలను రాస్తున్నాం. శాశ్వతంగా సోషల్‌ ఆడిట్‌ కోసం ఇవన్నీ చేస్తున్నాం. అర్హత ఉన్నవారు మిగిలిపోకుండా ఉండడానికి, అర్హత లేకుండా పథకాన్ని పొందిఉంటే.. తొలగించడానికి ఇవన్నీచేస్తున్నాం. సోషల్‌ఆడిట్‌ మెకానిజాన్ని గ్రామ సచివాలయంలో అంతర్భాగంగా పెట్టాం. దాదాపు 500 రకాల సేవలను అందిస్తున్నాం.
సర్టిఫికెట్‌ కావాలన్నా, రేషన్‌ కార్డు కావాలన్నా, పెన్షన్‌ కార్డు కావాలన్నా.. 72 గంటల్లో ఇస్తామా? వారంరోజుల్లో ఇస్తామా? లేకపోతే రెండు వారాల్లో ఇస్తామో స్పష్టంగా వివరణ ఇస్తూ... ఏయే సేవలు ఎన్నిరోజుల్లోగా అందిస్తామో... ప్రదర్శించమని అధికారులకు చెప్పాం. స్పందన అనే కార్యక్రమంలో వారానికి ఒకరోజు సోమవారం కార్యక్రమం పెట్టి సమస్యలను అన్నీ వినేందుకు అధికారులను అందుబాటులో ఉండమని చెప్తున్నాం. మంగళవారం నేరుగా నేను కలెక్టర్లతో స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌తో సమీక్షిస్తున్నాను. వారానికి ఒకరోజు జరుగుతున్న ఈ స్పందన అనే కార్యక్రమం ప్రతిరోజుకూడా గ్రామ సచివాలయంలో జరుగుతుంది.  స్పందన అనే కార్యక్రమం... అభివృద్ధితో కూడిన పాలన ముఖచిత్రాన్ని ఇది పూర్తిగా మారుస్తుంది.
చంద్రబాబుగారు ఈ చర్చలో పాల్గొని ఉంటే బాగుండేది. వాళ్లు ప్రవేశపెట్టిన జన్మభూమి కమిటీలు విఫలం అయ్యాయి. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు.. ఏరకంగా విజయవంతం అవుతుందో తెలిపే విధంగా చర్చ ఉండేది.  దురదృష్టవశాత్తూ ఆయన రాలేదు. కాని ఈప్రసంగాన్ని టీవీల్లో చూస్తారని అనుకుంటున్నాను. ఆయన నాలెడ్జ్‌ పెంచుకుంటారని ఆశిస్తున్నాను'' అని జగన్ చంద్రబాబు కు చురకలు అంటిస్తూ మాట్లాడారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com