పోలీసుల సాహసం..నదిలో దూకిన యువతిని కాపాడిన వైనం

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 02:16 PM
 

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ సమీపంలో గల పులిగడ్డ పెనుమూడి వంతెన వద్ద పోలీసులు ప్రమాద రహిత దినోత్సవాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఈ ఉదయం నుంచి వంతెన వద్ద వాహనదారులకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఓ యువతి వంతెన పై నుంచి నదిలో దూకేశారు. ప్రమాద రహిత దినోత్సవాన్ని నిర్వహిస్తోన్న ఎఎస్ఐ మాణిక్యాల రావు, కానిస్టేబుల్ గోపిరాజు ఈ దృశ్యాన్ని చూశారు.


క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఏ మాత్రం ఆలోచన చేయకుండా తాము కూడా నదిలో దూకేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ నిండుగా ప్రవహిస్తోంది. అయినప్పటికీ.. వారు లెక్క చేయలేదు. నదిలో దూకి, ఆమెను కాపాడారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం చికిత్స కోసం అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మాణిక్యాలరావును, గోపిరాజును అభినందించారు.