ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: టీడీపీ

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 12:45 PM
 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ధరలు పెంచడమే పనిగా పెట్టుకుందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై అవాస్తవాలు ప్రచారం చేసిన జగన్‌.. ముఖ్యమంత్రి కాగానే సామాన్యుల నడ్డి ఎందుకు విరుస్తున్నారని ఆ పార్టీ నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఛార్జీల పెంపుపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏటా రూ.700 కోట్లు భారం పడుతుందని వివరించారు. పేదలపై మోపిన ఛార్జీల భారాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. రాజధాని అమరావతిలో 144, రాష్ట్రమంతా సెక్షన్‌ 30 అమల్లో ఉందని వ్యాఖ్యానించారు. ఛార్జీల పెంపుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో సామాన్యులపై ధరలు, ఛార్జీల భారం వేయలేదని దేవినేని పేర్కొన్నారు.