ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఘా కళ్లకు నీరసం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2019, 07:41 PM

జిల్లాలో నిఘా వ్యవస్థ బలహీనంగా ఉంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపు తప్పుతోంది.. కేసుల ఛేదన కష్టతరమవుతోంది. జిల్లా పోలీసు కార్యాలయంలో వ్యూహాత్మక స్పందన కేంద్రం (స్ట్రాటజిక్‌ రెస్పాన్స్‌ సెంటర్‌) పేరుతో నిఘా వ్యవస్థ నడుస్తోంది. రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీసు కార్యాలయంతోపాటు కాకినాడ, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థల ఆధ్వర్యంలోనూ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాల ద్వారా సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఉంది. ఇదికాక జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో.. అమరావతిలోనూ పర్యవేక్షణ కేంద్రాలతో సీసీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు ..మిగతా 7లోపర్యవేక్షించే వీలుంది. జిల్లావ్యాప్తంగా 64 మండలాలుంటే.. జిల్లా పోలీసు కార్యాలయం పరిధిలో 36 మండలాల్లో మాత్రమే ఈ నిఘా వ్యవస్థ అందుబాటులో ఉంది. రాజమహేంద్రవరం పోలీసుల పరిధిలో ఆరు మండలాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన మండలాలతోపాటు మన్యంలోని కొన్ని మండలాలకు ఈ వ్యవస్థ అందుబాటులో లేదు. జిల్లా పోలీసు కార్యాలయం పరిధిలోని కాకినాడ, పెద్దాపురం, అమలాపురం, రామచంద్రపురం, రంపచోడవరం సబ్‌డివిజన్లలోని 47 పోలీసు స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల వ్యవస్థ అందుబాటులో ఉంది. రాజమహేంద్రవరం పోలీసు అర్బన్‌ జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య, ఉత్తర, దక్షిణ మండలాల్లోని 17 పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ వ్యవస్థ ఉంది. వీటికి సంబంధించి జిల్లావ్యాప్తంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో 1,479 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నా.. వాటిలో ప్రస్తుతం 610 మాత్రమే పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌ లిమిటెడ్‌- మ్యాట్రిక్స్‌ ఆధ్వర్యంలో 919 కెమెరాలు ఏర్పాటుచేస్తే.. సాంకేతిక లోపాలు.. ఫైబర్‌ గ్రిడ్‌ పనుల్లో నత్తనడక కారణంగా మిగిలినవి అందుబాటులోకి రాలేదు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కెమెరాల్లో 120 జిల్లాకు కేటాయిస్తే వీటిలో 90 మాత్రమే పనిచేస్తున్నాయి. కాకినాడ ఆకర్షణీయ నగరం ప్రాజెక్టులో భాగంగా 440 కెమెరాలు అందుబాటులోకి రాగా.. వీటిలో 360 మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయి. రెండేళ్లుగా స్మార్ట్‌ సిటీ పనుల్లో భాగంగా ఎక్కడికక్కడ తవ్వకాలు జరపడం.. ఆ పనులు వేగంగా  పూర్తి చేయకపోవడంతో ఆ ప్రభావం నిఘా వ్యవస్థపై పడింది. కాకినాడ నగరంలో నిత్యం వేలాది మందితో రద్దీగా ఉంటే భానుగుడి సెంటర్‌, ఆనంద్‌ థియేటర్‌ కూడలి, ప్రతాప్‌ నగర్‌, కాకినాడ నుంచి యానాంకు వెళ్లే కీలకమైన మార్గంలోని బాలయోగి కూడలి, కాకినాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే కీలక మార్గంలోని అచ్చంపేట కూడలి.. కాకినాడ నుంచి సామర్లకోట వైపు వెళ్లే ప్రతాప్‌నగర్‌ కూడలిలోని సీసీ కెమెరాలు గత మూడు నెలలుగా పనిచేయడంలేదు. నగరంలో వాణిజ్య కేంద్రమైన మెయిన్‌ రోడ్డులో కొన్నిచోట్ల అదే పరిస్థితి. రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీసు శాఖ పరిధిలో 480 వరకు కెమెరాలు ఉంటే.. 180 వరకు పనిచేస్తున్నాయి. ఐపీ క్లౌడ్‌ బేస్డ్‌ ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరం పోలీసు అర్బన్‌ జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య, ఉత్తర, దక్షిణ మండలాల పరిధిలో 320 కెమెరాలు (మ్యాట్రిక్స్‌ కంపెనీ నిర్వహణ) మంజూరయ్యాయి. వీటిలో 150 వరకు అందుబాటులోకి వచ్చాయి. నగర పాలక సంస్థ పరిధిలో 170 వరకు ఉన్నా ఎక్కువ శాతం సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలో వీఆర్‌పురం, ఆత్రేయపురం, కూనవరం కిర్లంపూడి, గంగవరం, మామిడికుదురు, కోరుకొండ, రౌతులపూడి, అంబాజీపేట, తొండంగి తదితర మండలాల్లో నిఘా కెమెరాల వ్యవస్థ అందుబాటులోకి తేవాల్సి ఉంది. సంఘటన స్థలంలోని 360 డిగ్రీల కోణాల్లోని దృశ్యాలను నిక్షిప్తం చేస్తే పాయింట్‌ జూమ్‌ కెమెరాలు (పీటీజెడ్‌) 296, ఎదురుగా ఉన్న దృశ్యాలను నిక్షిప్తం చేసే ఫిక్స్‌డ్‌ కెమెరాలు 607, ముఖాలను గుర్తించే ఫేఫషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) 60, జన సందోహం ఎక్కువగా ఉన్నప్పుడు నిశితంగా విశ్లేషించే ఎనలైటిక్‌ కెమెరాలు 75, రోడ్డు ప్రమాదాలు, ఇతర నేరాలు జరిగినప్పుడు నంబర్‌ ప్లేటు ఆధారంగా గుర్తించే వీలుగా ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలు 320, సిగ్నల్‌ వ్యవస్థ నిబంధనలు అతిక్రమించే వారిని గుర్తించే వీలుగా రెడ్‌లైట్‌ వైలేషన్‌ డిటెక్షన్‌ (ఆర్‌ఎల్‌వీడీ) కెమెరాలు 93 అందుబాటులో ఉన్నాయి. కానీ పీటీజెడ్‌, ఫిక్స్‌డ్‌, ఎనలైటిక్‌ కెమెరాల మినహా మిగిలిన వాటి సేవలు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. సర్వర్‌ అప్‌డేట్‌ కాకపోవడం.. స్మార్ట్‌ సిటీ పనులు ఇతరత్రా సాంకేతిక సమస్యలు విఘాతంగా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com