విజయవాడలోని వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 06, 2019, 10:16 AM
 

విజయవాడ బీసెంట్ రోడ్డులోని R900 వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బట్టలకు అంటుకున్న మంటలు క్షణాల్లోనే మొత్తం విస్తరించడంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ కమ్ముకుంది. భారీగా ఎగసిపడుతున్న మంటలు పక్కనే ఉన్న షోరూంలకు కూడా వ్యాపించే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్క షాపులకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. ప్రమాదం కారణంగా భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది.