ఆర్ఎస్ఎస్ తో పాటియా? వ‌ల‌ని మాట‌ది : పవన్ కల్యాణ్

  Written by : Suryaa Desk Updated: Thu, Dec 05, 2019, 09:51 PM
 

రాయలసీమలో పర్యటిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ కార్యకర్తల నుంచి సీఎం జగన్ వరకు ఎవరినీ వదలకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీ అధినాయకత్వం గురించి, బీజేపీతో తన ప్రస్తుత సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి నాయకుల పనిబట్టాలంటే నరేంద్ర మోదీ, అమిత్ షాలే సరైనవాళ్లు అని, తాను బీజేపీకి ఎప్పుడూ దూరం కాలేదని, కొన్ని అంశాల్లోనూ ఆ పార్టీతో విభేదించానని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాల్లో చర్చ జరుగుతుండగానే, పవన్ ఈసారి ఆర్ఎస్ఎస్ ప్రస్తావన తీసుకువచ్చారు.
అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతలకు స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. జనసేనను బెదిరించేవాళ్లందరికీ ఇదే తన సమాధానం అని, తాను రోడ్లపైకి వస్తే ఏ ఆర్మీలు పనిచేయవని అన్నారు. సమాజం కోసం తాను ఎక్కడికైనా వస్తానని తెలిపారు. "ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల్లో పెళ్లి కూడా చేసుకోకుండా దేశం కోసం సర్వం ధారపోస్తున్న వాళ్లు ఉన్నారు. దేశం కోసం కుటుంబాలను త్యాగం చేసిన వాళ్లున్నారు. వాళ్లతో మనం పోటీపడలేమనుకుంటున్నాను. నాకు పిల్లలపై మమకారం లేదు, జీవితంపై అంతకన్నా ఇష్టం లేదు" అంటూ తన వైఖరి వెల్లడించారు. ఇటీవల తరచుగా బీజేపీ, ఆ పార్టీ అగ్రనాయకత్వం గురించి పవన్ ప్రస్తావిస్తుండడాన్ని రాజకీయ ప్రత్యర్థులు బీజేపీలో జనసేన విలీన ప్రయత్నాలుగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడడంపై ఎలాంటి స్పందనలు వినిపిస్తాయో చూడాలి!