రాజధాని విషయంలో క్షమాపణ చెప్పడానికి సిద్దమే... : చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Thu, Dec 05, 2019, 09:28 PM
 

వైసిపి ప్రభుత్వం రాజధాని అమరావతి విషయంలో ఇష్టానుసారంగా భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  టిడిపి ఆధ్వర్యంలో రాజధానిపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ జగన్ పరిపాలన అమరావతి నిర్మాణానికి  వ్యతిరేకంగా సాగుతోందన్నారు. 
ముఖ్యంగా ప్రజారాజధాని అమరావతిపై ప్రజల్లో లేనిపోని అపోహాలు తెస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆదాయానికి ముఖ్యకారణం హైదరాబాదేనని... దాన్నిఅలా తీర్చదిద్దింది తానేనన్నారు. అదే తరహాలో అమరావతిని నిర్మించాలని భావించానని... కానీ వైసిపి ప్రభుత్వం మాత్రం అమరావతి నిర్మాణంపై అపోహలు సృష్టిస్తోందన్నారు. 
ఆరోగ్యశ్రీ పథకాన్ని పక్క రాష్ట్రాల రాజధానులకు కూడా వర్తింపచేసారని... దాని వల్ల హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకే లాభమన్నారు. అలా కాకుండా పక్కరాష్ట్రాలలో ఉన్న రాజధానులతో సమానంగా ఏపిలో రాజధాని తెస్తే మనకే లాభం చేకూరుతుంది కదా అని అన్నారు. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పవల్లి అమరావతి అని చంద్రబాబు కొనియాడారు.
అమరావతి ప్రజా రాజధాని అని... అదే గనుక తాను కోరుకున్నట్లు నిర్మాణం జరిగితే ప్రతి పౌరుడు గర్వించేలా వుంటుందన్నారు.రాజధాని విషయంలో తనవల్ల తప్పు జరిగిందని ప్రజలు చెపితే క్షమాపణ చెప్పడానికి ఏమాత్రం వెనుకాడనని అన్నారు. అలా అనడానికి ఆస్కారం లేకుండా పారదర్శకంగానే తాను రాజధానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నానని అన్నారు.