జగన్ ముందుకు గన్నవరం పంచాయతీ

  Written by : Suryaa Desk Updated: Mon, Nov 18, 2019, 07:43 PM
 

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరతారనే ప్రచారం నేపథ్యంలో...కొత్త పంచాయతీ మొదలైంది. వైసీపీలోకి వంశీ రాకను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గన్నవరం వైసీపీ ఇన్‌ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు... సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. కృష్ణా జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి యార్లగడ్డ వెంకట్రావు ఈ అంశంపై అరగంటకు పైగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం పని చేయాలని... మీ రాజకీయ భవిష్యత్తుకు నాదే భరోసా అని సీఎం జగన్ యార్లగడ్డ వెంకట్రావుకు హామీ ఇచ్చినట్టు సమాచారం. జగన్‌తో భేటీ అనంతరం మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, యార్లగడ్డ వెంకట్రావు కలిసి ఒకే కారులో వెళ్లిపోవడం విశేషం.


ఇదిలా ఉంటే తనకు సీఎం జగన్ స్పందనను బట్టి భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని వెంకట్రావు చెబుతున్నారు. వంశీకి గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే వెంకట్రావు భవిష్యత్తు ఏమిటని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో వెంకట్రావు, వంశీకి తీవ్ర పోటీ ఇచ్చారు. కేవలం 900 ఓట్ల తేడాతోనే వంశీ గెలుపొందారు. అయితే ఇరువురికి ఆమోదయోగ్యమైన పరిష్కారంతో జగన్ ఉన్నట్లు సమాచారం.