విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రం

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 12, 2019, 07:55 PM
 

ఏజెన్సీ ప్రాంతంలో చలిగాలులు పెరిగి, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాయంత్రం 4 గంటలు అయిందంటే చాలు ప్రజలు చలి తాకిడితో వణికిపోతున్నారు. చెట్లు దట్టంగా ఉండడంతో ఆర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తుంది. ఉదయం 9 గంటల వరకు మన్యంలో మంచు తెరలు వీడడం లేదంటే తీవ్రత ఎలా ఉందో ఊహించుకోవచ్చు. పాడేరుకు సమీపంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డు కార్యాలయం, అరకులోయ కాఫీబోర్డు వద్ద 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటల వరకు సూర్యుడు కన్పించ లేదు.  పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో ప్రధాన రోడ్లలో వాహన చోదకులు ఉదయం 8 గంటల దాకా లైట్లు వేసుకునే ప్రయాణిస్తున్నారు. మంచు, చలి కారణంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.