ఫిక్సింగ్ చేస్తే 10ఏళ్లు శిక్ష!!

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 12, 2019, 07:49 PM
 

తమ దేశంలో క్రీడల అవినీతిని నిర్మూలించేందుకు శ్రీలంక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్‌ను శ్రీలంకలో క్రిమినలైజ్ చేసింది. సోమవారం లంక పార్లమెంట్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన మూడు క్రీడా బిల్లులకు ఆమోదం తెలిపింది. క్రీడలలో అవినీతికి పాల్పడితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా ( 100 మిలియన్ శ్రీలంక కరెన్సీ) విధించే విధంగా మూడు బిల్లులు రూపొందించింది. గత రెండేళ్లుగా లంక బోర్డు అవినీతి కుంభకోణాలతో సతమతమవుతున్న కారణంగా ఈ చర్యలు తీసుకుంది. శ్రీలంక క్రీడా మంత్రి హరిన్ ఫెర్నాండో సమర్పించిన మ్యాచ్ ఫిక్సింగ్‌ బిల్లులకు 1996 ప్రపంచకప్ కెప్టెన్, ప్రస్తుత క్యాబినెట్ మంత్రి అర్జున రణతుంగ పూర్తి మద్దతు ఇచ్చారు. లంక పార్లమెంటు మూడు క్రీడా బిల్లులకు ఆమోదం తెలిపేలా రణతుంగ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో సహా అనేక ఇతర క్రికెట్ దేశాలలో మ్యాచ్ ఫిక్సింగ్ తీవ్రమైన నేరంగా బావించబడుతున్న విషయం తెలిసిందే. కొత్త చట్టం ప్రకారం.. క్రీడలకు సంబంధించిన ఏ వ్యక్తి అయినా మ్యాచ్ ఫిక్సింగ్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నా, ఫిక్సింగ్ సమాచారం అందించినవారు, బెట్టింగ్ ఆపరేటర్లకు అనుగుణంగా పిచ్‌లు తయారుచేసే క్యూరేటర్లు, డబ్బు కోసం ఉద్దేశపూర్వకంగా నియమాలను దుర్వినియోగం చేసే అధికారులు శిక్షించబడుతారు. శ్రీలంక ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు విభాగానికి అవినీతి విధానాలను నివేదించడంలో విఫలమైతే కూడా శిక్ష అమలవుతుంది. గత రెండేళ్లుగా అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి అనేక సందర్భాల్లో శ్రీలంక క్రికెట్ బోర్డు అబాసుపాలైంది. మాజీ ఓపెనర్ సనత్ జయసూర్యపై ఐసీసీ మ్యాచ్ ఫిక్సింగ్ అభియోగాలు మోపింది. అయితే దర్యాప్తులో జయసూర్య ఐసీసీ ఏజెన్సీతో సహకరించకపోవడంతో అతనికి రెండేళ్ల నిషేధం విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నారనే ఆరోపణలతో మాజీ పేసర్ నువాన్ జోయిసాను సస్పెండ్ చేశారు. గత సంవత్సరం ఫాస్ట్ బౌలర్ దిల్హారా లోకుహెట్టిగేను సస్పెండ్ చేశారు. ఇక స్టార్ ఆటగాళ్లు కూడా మ్యాచ్ ఫిక్సింగ్‌లలో ఇరుక్కున్నారు. దీంతో అవినీతిని నిర్మూలించేందుకు లంక పార్లమెంటు చర్యలు తీసుకుంది.