ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతే దేశానికి వెన్నెముక: గవర్నర్ బిశ్వభూషణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 07:42 PM

రైతుల కష్టాలను అధిగమింపచేసే క్రమంలో వ్యవసాయ దారులకు అవసరమైన పూర్తి సహయ, సహకారాలను అందించవలసిన బాధ్యత నేటి సమాజంపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వ్యవసాయదారులను ఆర్ధికంగా బలోపేతం చేసే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైయస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ సమ్మన్ యోజన వంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. దేశానికి వెన్నెముక రైతులేనని వారి అభ్యున్నతి విషయంలో మరిన్ని పధకాలను అమలు చేయవలసి ఉందని వివరించారు.
విజయవాడ, ది వెన్యూ కన్వేన్షన్ సెంటర్ లో సోమవారం రాజ్యసభ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన క్రాప్ హాలిడే (పంట సెలవు దినం) పుస్తకాన్ని గౌరవ గవర్నర్ ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ నేపధ్యంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. వివిధ వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను నిర్ణయించే సమయంలో ఆ మద్దతు ధరలు రైతులకు లాభదాయకతను అందిస్తాయా లేదా అన్న విషయాన్నిదృష్టిలో ఉంచుకోవాలని గవర్నర్ సూచించారు. ఏపీలోని పొగాకు రైతులు 2000 సంవత్సరంలో పంట సెలవు దినం వంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవటానికి దారితీసిన పరిస్దితులను ‘క్రాప్ హాలిడే’ పుస్తకం ద్వారా వెలుగులోకి తీసుకురావటం ముదావహమన్న గవర్నర్ హరిచందన్ పుస్తక రచయిత డాక్టర్ యలమంచిలి శివాజీని ప్రత్యేకంగా అభినందించారు.
రైతుల పంట సెలవు నిర్ణయం వల్ల వ్యవసాయ సంక్షోభం నుండి బయట పడటమే కాకుండా, ఆనాటి రైతుల బాధల గురించి పాలకులు తెలుసుకోగలిగారని గవర్నర్ వివరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఐక్యంగా ముందుకు సాగాలని అప్పుడే ఆశించిన ఫలితం సిద్దిస్తుందని గవర్నర్ అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించి, పుస్తక పరిచయం చేసిన ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా సంఘం, రాష్ట్ర హిందీ అకాడమీ అధ్యక్షుడు, పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడతూ రైతుల సమస్యలపై నాడు పార్లమెంటులో నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత యలమంచిలికి దక్కుతుందన్నారు.
అచార్య ఎన్ జి రంగా, చరణ్ సింగ్ ల తదుపరి రైతుల కోసం పోరాటాలు చేసిన వారిలో శివాజీది ప్రధమ స్దానమన్నారు. పుస్తక రచయిత డాక్టర్ యలమంచిలి శివాజీ మాట్లాడుతూ రైతు సమస్యలపై విభిన్న సందర్భాలలో రాసిన వ్యాసాల సంపుటిని క్రాప్ హాలిడే పేరిట తీసుకురావటం జరిగిందని గవర్నర్ చేతుల మీదుగా దీనిని ఆవిష్కరింప చేసుకోవటం శుభపరిణామమని తెలిపారు. రైతు నేస్తం పౌండేషన్ ఛైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రైతుల సమస్యలను గుర్తించటంతో పాటు వాటికి సానుకూల పరిష్కారాలు చూపిన ఘనత కూడా శివాజీకి దక్కుతుందన్నారు. రైతు ప్రయోజనాలే పరమావధిగా తమ ట్రస్టు నుండి రైతు నేస్తం, ప్రకృతి నేస్తం, పశు నేస్తం పేరిట పుస్తకాలను ప్రచురిస్తున్నామన్నారు. పొగాకు బోర్డు అధ్యక్షులు యడ్లపాటి రఘునాథ్ బాబు, పొగాకు బోర్డు మాజీ చైర్మన్ డాక్టర్ పి.దయాచారి, కార్యదర్శి అద్దంకి శ్రీధర్ తదితరులు కార్యక్రమంలో ప్రసంగించారు. పుస్తకావిష్కరణలో భాగంగా పలువురు పొగాకు రైతులను గవర్నర్ సత్కరించి, మెమొంటోలను అందచేసారు. ఆలూరి చంద్రశేఖర్, డాక్టర్ కె. హేమలకు తొలి కృతి స్వీకర్త హోదా దక్కగా గవర్నర్ బిశ్వభూషణ్ వారికి పుస్తకాలను బహుకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com