సీఎం జగన్‌కే సలహాలు ఇస్తానంటున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 12, 2019, 07:37 PM
 

ఆమధ్య కాలంలో పాటలు, సినీ రచయితల ఫంక్షన్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. తన నటనా జీవితాన్ని గుర్తుచేసుకుంటూ తన చిరకాల ప్రత్యర్థి చిరంజీవిని విమర్శిస్తూ ఆయన ప్రసంగం సాగింది. అయితే ప్రస్తుతం మోహన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. పార్టీకి మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు.
కారణం.. తన విద్యాసంస్థల్లో బిజీగా ఉండే మోహన్ బాబుకు రాజకీయాలంటే అసలు ఇష్టం లేదట. నాకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పించింది అన్న ఎన్టీఆర్ అంటూ మాట్లాడే మోహన్ బాబు పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశారు. అయితే మోహన్ బాబుకు కీలక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట జగన్మోహన్ రెడ్డి.
ఇదే విషయంపై ఫోన్లో జగన్ స్వయంగా మోహన్ బాబుతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే తాను పార్టీలో ఉంటాను తప్ప దయచేసి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పవద్దని సున్నితంగా మోహన్ బాబు తిరస్కరించారట. ఏ విషయంలోనైనా తన సలహాలు అవసరమైతే ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని జగన్‌కు కలెక్షన్ కింగ్ చెప్పారట. ఎవరైనా పదవులు ఇస్తానంటే ఎగిరి గంతేసి తీసుకుంటారు.. కానీ మోహన్ బాబు మాత్రం అంటీఅంటనట్లుగా పార్టీలో ఉండటం మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది.