ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకులో చోరీ.. 17 కిలోల బంగారం మాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2019, 12:56 PM

అసలు బ్యాంకు పెట్టడానికి ఏమాత్రమూ ఆమోదయోగ్యం కాని స్థలం. జనసంచారం ఉండదు. ఎక్కడో అడవిలో ఓ మూలన విసిరేసినట్లున్న అద్దె భవనంలో బ్యాంకును పెట్టారు. లోపలకు వెళ్లిచూస్తే స్ట్రాంగ్‌రూమ్‌లు కనిపించవు. సెక్యూరిటీ కనిపించదు. రాత్రికి రాత్రే ఓ జేసీబీ తెచ్చి భవనాన్ని పడగొట్టి బ్యాంకు మొత్తం దోచుకెళ్లినా ఎవ్వరికీ తెలియదు. ఊర్లో జనం బ్యాంకు వద్దకు రావాలన్నా 20 నిముషాలు పడుతుంది. అలాంటి చోట నాలుగేళ్లుగా ఆంధ్రాబ్యాంకును నడుపుతున్నారు. గేట్లకు వేసిన తాళాలు, మూసిన బీరువాలు అలాగే ఉన్నాయి. అసలు బ్యాంకులో ఎక్కడా కూడా చోరీ జరిగిన ఆనవాళ్లులేవు. మొత్తం రూ.6.29 కోట్ల విలువైన 17 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.34 లక్షల నగదు చోరీకి గురయ్యింది. ఆ నగలపై రూ.3.47కోట్ల రుణాలు బాంకు మంజూరు చేసి ఉంది. ఈ ఘటనలో బ్యాంకు అధికారుల పాత్ర ఉందనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు మేనేజర్‌తో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారిస్తున్నారు.


చిత్తూరు–బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఆనుకుని ఉన్న మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకు శాఖలో మేనేజరు పురుషోత్తం, క్యాషియర్‌ నారాయణస్వామితో పాటు మొత్తం ఆరుగురు పనిచేస్తున్నారు. బ్యాంకులోని లాకర్‌ (ఓ అల్మారా లాంటిది) తెరవాలన్నా, మూయాలన్నా మేనేజరు, క్యాషియర్‌ ఇద్దరి వద్ద ఉన్న తాళాలు తీస్తేనే జరుగుతుంది. ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం మేనేజరు, క్యాషియర్‌ అన్నింటిని లాక్‌ చేశారు. క్యాషియర్‌ తాళాలు మేనేజర్‌కు ఇచ్చేశారు. ప్రధాన ద్వారానికి సంబంధించిన తాళాలు క్యాషియర్, మేనేజర్‌ వద్ద ఉంటాయి. ఏ ఒక్కరు వచ్చైనా దీన్ని తెరిచే అవకాశముంది. శనివారం బ్యాంకు సెలవు అయినప్పటికీ మేనేజరు వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. ఆదివారం ఎవరూ బ్యాంకుకు రాలేదు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో క్యాషియర్‌ బ్యాంకు ప్రధాన ద్వారం తెరచి లోపలకు వెళ్లాడు. ఓ టేబుల్‌పై కంప్యూటర్‌ సీపీయూను తెరిచినట్లు ఉండటాన్ని గుర్తించాడు. కంప్యూటర్లు ఆన్‌ చేయడానికి ప్రయత్నిస్తే అవి పనిచేయలేదు. కొద్దిసేపటికి మేనేజర్‌ కూడా వచ్చి చూడగానే ఇక్కడ చోరీ జరిగిందని సిబ్బందికి చెప్పాడు. పోలీసులకు మాత్రం మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్‌చేసి తమ బ్యాంకులో చోరీ జరిగినట్లు సమాచారమిచ్చారు. వెంటనే చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డితో పాటు యాదమరి, చిత్తూరు క్రైమ్‌ పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌తో చోరీ జరిగిన తీరును పరిశీలించారు.


బ్యాంకులో చోరీ జరిగిన తీరు పరిశీలిస్తే నివ్వరెపోవాల్సిందే. దొంగతనాన్ని ప్రవృత్తిగా పెట్టుకున్న వ్యక్తి కచ్చితంగా షటర్‌ను పగులగొట్టడమే, గేట్లను విరచడమో చేయాలి. కానీ ఎంచక్కా ప్రధాన ద్వారం తాళాలు తీసి బ్యాంకు లోపలికి వెళ్లి లాకర్ల తాళాలు తీసి, బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఇక బ్యాంకు లోపల, బయట సీసీ కెమెరాలు ఉన్నా ఏ ఒక్కటీ పనిచేయలేదు. అలాగని వైర్లను కత్తిరించలేదు. బ్యాంకు లోపలున్న ప్రధాన కంప్యూటర్‌ సర్వర్‌లో అమర్చిన హార్డ్‌డిస్క్‌ను ముందుగానే తీసుకెళ్లిపోయారు. బ్యాంకులో రూ.4 లక్షలకు పైగా నగదు ఉంటే కేవలం రూ.2.30 లక్షల వరకు మాత్రమే చోరీ చేసి, మిగిలిన నగదును ఇక్కడే వదిలేశారు. ఇవన్నీ చోరీలో బ్యాంకులో పనిచేసేవారి  హస్తం ఉందని నిర్ధారిస్తున్నాయి. పక్కా ప్రణాళికతోనే చోరీకి పాల్పడ్డట్లు స్పష్టమవుతోంది. పైగా బ్యాంకు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చోరీలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రాబ్యాంకులో నగలు, నగదు చోరీకి గురికావడంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది.


2005వ సంవత్సరం.. యాదమరి మండల కేంద్రంలో ఉన్న యూనియన్‌ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గ్యాస్‌ కట్టర్లు ఉపయోగించి ఇక్కడున్న బ్యాంకు లాకర్లను తొలగించిన దుండగులు ఏకంగా 22 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను కొల్లగొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసులో తమిళనాడుకు చెందిన అయ్యనార్, మరో పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 19 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిని ఖాతాదారులకు పంచడానికి ఏళ్ల సమయం పట్టింది. మరోవైపు బెయిల్‌పై బయటకొచ్చిన ఈ ముఠా కేరళలోని మరో బ్యాంకుకు కన్నంవేసి అక్కడ 20 కిలోలకు పైగా బంగారం దోపిడీ చేయడం సంచలనం రేకెత్తింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com