ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామ సచివాలయలకు నిధుల కొరత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2019, 01:08 PM

ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇటీవల నిర్వహించిన సచివాలయ ఉద్యోగ పరీక్షల్లో ఎంపికైన వారు కొలువు దీరనున్నారు. జిల్లా వ్యాప్తంగా సచివాలయాల ఏర్పాటుకు భవనాల కొరత ఉంది. సొంత భవనాలు లేని ప్రాంతాల్లో పాఠశాలల అదనపు గదులు, సామాజిక భవనాల్లో తాత్కాలిక ఏర్పాటుకు ప్రతిపాదించనున్నారు. నిర్మాణం ఇప్పట్లో కష్టమేనన్న భావన అధికారుల్లో నెలకొంది. ఈ మేరకు ఇతర శాఖలకు చెందిన భవనాలు, అద్దె వసతుల కోసం క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారులు, పంచాయతీ కార్యదర్శిలు వెతుకులాట మొదలుపెట్టారు.


జిల్లాలో కొత్తగా ఏర్పడిన పది పంచాయతీలతో పాటు, మొత్తం 1048 గ్రామ పంచాయతీలు,రెండు కార్పొరేషన్ ,ఏడు మున్సిపాలిటీ లు ,మూడు నగర పంచాయతీ ఉన్నాయి. కనీసం రెండు వేల జనాభా ప్రాతిపదికన సచివాలయాలను విభజించారు. ఈ మేరకు భౌగోళికంగా రెండు, మూడు గ్రామ పంచాయతీలు ,డివిజన్ లను విలీనం చేసి 1200 సచివాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో 750 పైగా గ్రామాలకు శాశ్వత భవనాలు ఉండగా; మరో 450 సొంత భవనాలు లేవని అధికారులు గుర్తించారు. శాశ్వత భవనాలకు ఈ నెల 25వ తేదీ లోపు రాష్ట్ర పంచాయతీరాజ్‌ , మున్సిపల్ శాఖ ఇచ్చిన నమూనా ప్రకారం రంగులు వేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. సచివాలయాలకు సంబంధించి 11 ప్రభుత్వ శాఖల కొలువులకు ఈ నెల మొదటి వారంలో పరీక్షలు నిర్వహించారు. ఎంపికైన ఉద్యోగులు అక్టోబరు రెండో తేదీ నుంచి విధుల్లోకి రావచ్చని అంచనా.


సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయిలోనే అన్ని సేవలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందుకు తగిన విధంగా ఫర్నిచర్‌ సమకూర్చేందుకు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌,మున్సిపల్ శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కార్యాలయానికి 10 టేబుళ్లు, 30 కుర్చీలు, 6 ఫైల్‌ ర్యాక్‌లు, ఒక గ్రామ సచివాలయ బోర్డు, ఒక బీరువాతో పాటు, ఆరు నెలలకు సరిపడ స్టేషనరీ సమకూర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాటి కొనుగోలు నిమిత్తం రాష్ట్రానికి రూ.200 కోట్లు కేటాయించారు. ఆ సామగ్రిని ప్రభుత్వం తరఫున సరఫరా చేస్తారా? లేక ఎక్కడికక్కడ అధికారులు సమకూర్చుకోవాలా అనే విషయమై ఇంకా మండలాలకు స్పష్టతక రాలేదు. ప్రస్తుత ఖజానా ఆంక్షల నేపథ్యంలో ముందస్తుగా


పంచాయతీలే సమకూర్చుకోవాల్సి వస్తే ఒక్కో చోట కనీసం రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాలి. ఈ బరువు తమపైనే పడుతుందని గ్రామ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. 'చిన్న ఉద్యోగులం.. ఇప్పటికే ఆరు నెలలుగా గ్రామాల్లో వీధిబల్బులు, పారిశుద్ధ్యం కోసం స్థోమతకు మించి సొంత డబ్బులు పెట్టాం. కొన్ని దుకాణాల్లో హామీ ఇచ్చి సామగ్రి కొన్నాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో దివ్యాంగ ఓటర్లకు వీల్‌ఛైర్లు ఏర్పాటు చేశాం. వీటన్నిటికీ సొమ్ము రావాల్సి ఉన్నా, సీఎఫ్‌ఎంఎస్‌ ఆంక్షల కారణంగా బిల్లులు కావడం లేదు. ఇప్పుడు సచివాలయాల ఫర్నిచర్‌ భారం కూడా తమపై వేస్తే, మోయలేమని ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుత పంచాయతీ కార్యాలయాలకు ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం సచివాలయాలకు రంగులు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు ఒక్కో భవనానికి రూ.20-30 వేల వరకు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. ఇందుకయ్యే సొమ్మును మాత్రం పంచాయతీ నిధుల నుంచే వెచ్చించాలని అధికారికంగా ప్రకటించారు. దీంతో కార్యదర్శులు స్థానిక అధికార పార్టీ నాయకులను ఆశ్రయిస్తున్నారు. చాలా చోట్ల నాయకులు కూడా నిరాసక్తత చూపుతుండటంతో కార్యదర్శులు సందిగ్ధంలో పడ్డారు. మండలస్థాయిలో ప్రస్తుత భవనాల విస్తీర్ణం, గదుల సంఖ్య, విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ, కంప్యూటర్‌, ఇంటర్నెట్‌, స్టోర్‌ గది తదితర వసతులపై మండల స్థాయిలో ఎంపీడీవో, ఈవోఆర్డీ, పీఆర్‌ ఏఈలు క్షేత్రస్థాయిలో రెండురోజుల పాటు పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నారు.


జిల్లావ్యాప్తంగా 450 గ్రామ సచివాలయాలకు సొంత భవనాలు లేవు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వశాఖలకు చెందిన ఇతర భవనాల్లో సచివాలయాలను నిర్వహిస్తాం. అవి కూడా లేకపోతే అద్దెకు తీసుకుంటామని అధికారులు భావిస్తున్నారు ఈ ఖర్చును ఎవరు భరిస్తారు అని ప్రశ్నిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com