ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్ 2 నుండి అమలులోకి రానున్న గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2019, 10:04 PM

భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఆరురోజుల వ్యవధిలో ప్రతిష్ఠాత్మకంగా పరీక్షలు నిర్వహించి అనతికాలంలోనే ఫలితాలను  ప్రకటించడం రికార్డు అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని ప్రచారవిభాగంలో పురపాలక అభివృద్ధి శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావు, పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్ కుమార్ లతో కలిసి  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. గ్రామ, వార్డు స్థాయిలో శాశ్వతంగా సచివాలయాల ఏర్పాటు అమలు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అందులో భాగంగానే అక్టోబర్ 2 నుంచి ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అన్నారు. తక్కువ సమయంలో ఒకేసారి లక్షా 26 వేల 728 ప్రభుత్వ శాశ్వత ఉదోగాలు, వాలంటీర్లతో కలిపి సుమారుగా 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడం ఒక రికార్డు అన్నారు. పూర్తి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. పై నియామక ప్రక్రియలో ముఖ్యమంత్రి ఇచ్చిన స్వేచ్ఛాయుత వాతావరణంలో పకడ్భంధీగా నిర్వహించడం ఆనందించదగ్గ విషయమన్నారు. 19 రకాల పోస్టులను భర్తీ చేయడానికి ఉద్దేశించిన 14 రకాల పరీక్షలకు రాష్ట్రం మొత్తం మీద 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా అందులో 19.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షల్లో ఎటువంటి పొరపాట్లు అవకతవకలకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం జరిగిందన్నారు. అభ్యర్థులకు సంబంధించిన ఓఎమ్ఆర్ సమాధాన పత్రాలను 03.09.2019 నుంచి 09.09.2019 వరకు కేవలం ఆరు రోజుల్లో రికార్డు సమయంలో స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు.  స్కానింగ్ ప్రక్రియ పూర్తి అయిన పిదప నిష్ణాతులైన వారితో 10 వేల ఓఎమ్ఆర్ సమాధాన పత్రాలను రాండమ్ శాంప్లింగ్ పద్ధతిలో సరిచూడటం జరిగిందని తద్వారా మూల్యాంకనంలో ఎటువంటి తప్పులు దొర్లలేదని ధృవీకరించుకోవడం జరిగిందన్నారు. పరీక్షలు రాసిన అభ్యర్థులను కేటగిరీల వారీగా ఓసీలకు 40 శాతం కటాఫ్ మార్కులు నిర్ణయించగా, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం కటాఫ్ మార్కులుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఓసీ కేటగిరిలో 24,583 మంది, బీసీ కేటగిరీలో 1,00,494, ఎస్సీ కేటగిరీలో 63,629, ఎస్టీ కేటగిరీలో 9458 మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. అర్హత సాధించిన వారిలో 1,31,333 మంది పురుషులు కాగా 66,835 మంది స్త్రీలు ఉన్నారని మంత్రి తెలిపారు. ఓపెన్ కేటగిరీలో అత్యధికంగా 122.5 మార్కులు, బీసీ కేటగిరీలో 122.5, ఎస్సీ కేటగిరీలో 114, ఎస్టీ కేటగిరీలో అత్యధికంగా 108 మార్కులు సాధించారని తెలిపారు. మహిళా అభ్యర్థుల్లో గరిష్ఠంగా 112.5 మార్కులు, పురుష అభ్యర్థుల్లో గరిష్ఠంగా 122.5 మార్కులు సాధించారని తెలిపారు. ఇన్ సర్వీస్ అభ్యర్థులకు 10 శాతం వెయిటేజ్ మార్కులు విడిగా కలపబడతాయని ఆయన తెలిపారు.  ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి వారి సర్టిఫికేట్లను 21.09.2019 నుండి వెబ్ సైట్ నందు అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాల్ లెటర్ల పంపిణీ ప్రక్రియ 21.09.2019 నుండి 22.09.2019 వరకు ఉంటుందని, తనిఖీలు 23.09.2019 నుండి 25.09.2019 వరకు జరుపబడతాయని మంత్రి అన్నారు. అదే విధంగా నియామక ఉత్తర్వులు 27.09.2019న జారీ చేయబడతాయని, అవగాహన కార్యక్రమం 01.10.2019, 02.10.2019 రోజుల్లో జరుగుతాయని, తదుపరి గ్రామ, వార్డు సచివాయాలను 02.10.2019న ప్రారంభించడం జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.  వినూత్నంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాలను రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతం నుండి 02.10.2019న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందికి, సహకరించిన అభ్యర్థులకు, పరీక్షల విధానంపై అనుక్షణం అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందించిన మీడియాకు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com