ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమను ముంచెత్తిన వరదలు..జనజీవనం అస్తవ్యస్తం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2019, 03:05 PM

నిన్నటి వరకు ఒక లెక్క నేటి నుండి ఒక్క లెక్క అన్న విధంగా ఉంది రాయలసీమ పరిస్థితి. వాతవరణం ఒక్కసారిగా మారడంతో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం, చిత్తూరు , కర్నూల్ , కడప జిల్లాల్లో వర్షాలు భీభత్సవం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాలు , పట్టణాలు అన్న తేడా లేకుండా వీధులన్నీ నధులు , చెరువులను తలపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎండి ఎడారిగా కనిపించిన ప్రాంతాలు ఊహించని వరదలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మూడు రోజుల క్రితం అనంతపురం జిల్లా నార్పల సమీపంలోని హెచ్చెల్సీ తాడిపత్రి బ్రాంచి కెనాల్‌లో నిమజ్జనం చేసేందుకు నీరు లేకపోవడంతో భక్తులు గణనాథుని విగ్రహాలను అందులో ఉంచి వెళ్లారు. ఇప్పుడు అదే ప్రాంతంలో వరదలు చుక్కలు చూపుతున్నాయి. కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది దేవాలయం వరద నీటితో నిండిపోయింది. మహానంది కోనేరులు సైతం నీటమునిగాయి.


కర్నూల్ జిల్లా నంద్యాల రెవెన్యూ డివిజన్‌ నంద్యాల, మహానంది, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, సిరివెళ్ల, గోస్పాడు, కోవెలకుంట్ల తదితర మండలాలను వరద ముంచెత్తింది. కర్నూలు జిల్లా ఇంఛార్జి కలెక్టర్‌ రవి పట్టన్‌ శెట్టి సహాయక చర్యలను కలెక్టరేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి నిరంతరం సమీక్షిస్తున్నారు. మహానంది మండలం తమడ పల్లె, నంది పల్లె, సూర్యనంది గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మహానంది, సంజామాల, నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. మండలంలో కూడా వేలాది ఎకరాల్లో పంట నీటి పాలైంది. 


యాళ్లూరు, జూలేపల్లె గ్రామాల్లో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు జిల్లాలో 5,600 ఇళ్లలోకి నీరు చేరింది. పలు ఇళ్లు దెబ్బతినగా మూడు గేదెలు మృతి చెందాయి. నంద్యాల మండలం చాపిరేవుల, పాండురంగాపురం, పుసులూరు గ్రామాల్లో మిరప పంట నీట మునిగింది. రెండు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లోకి కేసీ కెనాల్‌ నీళ్లు ఉద్ధృతంగా రావడంతో పంట పొలాలు మునిగిపోయాయి. భారీ వర్షానికి కోవెలకుంట్ల మండలం భీమునిపాడు, గుళ్లదుర్తి, లింగాల గ్రామాలకు కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. 


కడప జిల్లాలోను అదే పరిస్థితి. జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు సరాసరి 68.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కడప 22.2 మి.మీ, వల్లూరు 18.4, పెనగలూరు 32.4, చింతకొమ్మదిన్నె 22.4, ఖాజీపేట 26.2, కమలాపురం 25.0, ఎర్రగుంట్ల 78.2, వీరపునాయునిపల్లె 26.8, రాయచోటి 50.6, చిన్నమండెం 36.0, సంబేపల్లె 48.2, వీరబల్లి 12.0, టి.సుండుపల్లె 36.8, లక్కిరెడ్డిపల్లె 25.2, రామాపురం 15.2, గాలివీడు 36.2, రాజంపేట 6.8, నందలూరు 2.8, పెనగలూరు 24.0, రైల్వేకోడూరు 49.6, ఓబుళవారిపల్లె 18.6, పుల్లంపేట 9.2, చిట్వేలు 25.0, బి.కోడూరు 2.6, బద్వేలు 12.0, గోపవరం 15.8, బి.మఠం 7.0, అట్లూరు 10.0, ఒంటిమిట్ట 11.8, జమ్మలమడుగు 93.6, మైలవరం 66.4, పెద్దముడియం 38.2, ముద్దనూరు 75.6, కొండాపురం 116.4, ప్రొద్దుటూరు 124.0, చాపాడు 80.6, దువ్వూరు 121.2, మైదుకూరు 71.2, రాజుపాలెం 152.6, పులివెందుల 38.0, లింగాల 28.2, వేంపల్లె 15.4, వేముల 35.4, తొండూరు 70.8, సింహాద్రిపురం 92.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో వాగులు ఉగ్రరూపం దాల్చాయి. 


వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు వంకలో వరద ఉధృతికి ఆటోలో ప్రయాణిస్తున్న కుటుంబం గల్లంతైంది. దువ్వూరు నుంచి ఆటోలో చిన్నారితో కలిసి భార్యాభర్తలు ప్రొద్దుటూరు మార్గంలో వెళుతున్నారు. రాధానగర్‌ సమీపంలోని కామనూరు వంక దాటుతుండగా వరద నీటి ఉధృతికి ఆటో బోల్తాపడటంతో అందులో ఉన్న ఆరుగురు నీళ్లలో కొట్టుకుపోయారు. రబ్బరు బోటు సాయంతో ప్రొద్దుటూరు, కడప అగ్నిమాపక శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ తెలియలేదు. పెద్దముడియం మండలం మేడిదిన్నెకు చెందిన మైల భాగ్యమ్మ పని నిమిత్తం వెళ్తూ తీగలేరును దాటే ప్రయత్నంలో నీటిలో పడి కొట్టుకుని పోతుండటం చూసి స్థానిక యువకులు కాపాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com