పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 15, 2019, 02:20 PM
 

జగన్ సర్కారు వంద రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో చీరాల వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్  ఖండించారు. సీఎం జగన్మోహన్‌రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తప్పని, ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆమంచి కృష్ణ మోహన్ డిమాండ్ చేశారు.  కాపులే కాకుండా అన్ని సామాజిక వర్గాల నాయకులూ వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సామాజిక న్యాయం జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. చంద్రబాబు సిగ్గులేకుండా తన పార్టీ వాళ్లను బీజేపీలోకి పంపుతున్నారని, చంద్రబాబు వెనుక ఉన్న వాళ్లంతా ఉత్తుత్తి నాయకులేనని ఎద్దేవా చేశారు. టీడీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. తాను దేనికీ ఆశపడి వైసీపీలో చేరలేదని ఆమంచి చెప్పుకొచ్చారు. ఇదే మీడియా సమావేశంలో మరో వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ను ప్రజలు బఫూన్‌గా చూస్తున్నారని, ఆయన మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అన్ని వర్గాల వారికీ సమాన ప్రాధాన్యం కల్పించే ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని ఉదయభాను చెప్పారు.