సైనికుడుగా విరమించి సేవకుడు అయ్యాడు

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 15, 2019, 02:14 PM
 

కుటుంబ సభ్యులతో విశ్రాంత జీవితాన్ని గడపాలని ఏ ఉద్యోగి అయినా అనుకుంటాడు. దేశ సేవలో 13 ఏళ్లు పనిచేసిన ఆ సైనికుడు విశ్రాంత జీవితాన్నీ సమాజం కోసం వెచ్చించాలని భావించి పోలీసు శాఖలో చేరి ట్రాఫిక్‌ విభాగంలో ఇతోథికంగా సేవ చేస్తున్నారు. కాకినాడ నగరానికి చెందిన బులుసు విశ్వేశ్వరరావు బీఎస్‌ఎఫ్‌లో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన సేవా దృక్పథం, సైనికుడిగా పొందిన శిక్షణలో క్రమశిక్షణను ప్రజలలో ఇసుమంతైనా అలవాటు చేయాలని తలచారు. అందుకు పోలీసు శాఖను ఎంచుకుని స్వచ్ఛందంగా పని చేసేందుకు ముందుకు వచ్చి ట్రాఫిక్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే కాకినాడ టౌన్‌హాల్‌ వద్ద జంక్షన్‌లో ట్రాఫిక్‌ నియంత్రణ సేవకుడిగా తొమ్మిదేళ్లుగా సేవలందిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించే వారికి ఆ నిబంధనలు బంధనాలు కావని, స్వీయ రక్షణ కోసమని ఎంతో వినయంగా వారికి వివరిస్తున్నారు. దీంతో నిత్యం ఆ మార్గంలో వచ్చి వెళ్లే వాహనచోదకులకు ఆయన సుపరిచితుడయ్యారు.