భర్తతో ఉన్న మహిళను చితకబాదిన భార్య

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 15, 2019, 01:43 PM
 

విశాఖ: ప్రేమించి పెళ్లి చేసుకుని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య నిలదీసింది. తనను వదిలి మరో మహిళతో ఉంటుండగా పట్టుకుంది. ఆ ఇంటికి తాళం వేసి ఆందోళనకు దిగింది. పోలీసులు వచ్చి ఆ మహిళను, భర్తను బయటకు తీసుకురాగా.. ఆగ్రహంతో ఆమెను చితకబాదింది. వివరాల్లోకి వెళితే..విశాఖ జిల్లా కొత్తూరుకు చెందిన పుష్పలత, గంగాధర రెడ్డి ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గంగాధర్‌ రెడ్డి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని విడిగా కాపురం పెట్టాడు. దీంతో మనస్తాపం చెందిన పుష్పలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు తన సమస్యను విన్నవించుకున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆదివారం వారు ఉంటున్న ఇంటికి తాళం వేసి ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గంగాధర రెడ్డిని, ఆ మహిళను బయటకు తీసుకొచ్చారు. సహనం కోల్పోయిన పుష్పలత ఆ మహిళపై దాడికి దిగింది. దీంతో ఘటనాస్థలంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పుష్పలత నుంచి ఆ మహిళను కాపాడారు. అనంతరం గంగాధర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.