ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం...

  Written by : Suryaa Desk Updated: Thu, Aug 22, 2019, 02:37 PM
 

విజయనగరం జిల్లా గజపతినగరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుకనుంచి మరో లారీ ఢీకొనడంతో మంటలు వ్యాపించి డ్రైవర్‌, క్లీనర్‌ సజీవదహనమయ్యారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అయితే ఆగి ఉన్న లారీ కూడా అంతకుముందే ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గురువారం వేకువజామున మండలంలోని గుడివాడ గ్రామం వద్ద 26వ నెంబరు జాతీయ రహదారిపై ఆగివున్న లారీని విశాఖ నుంచి పార్వతీపురంవైపు కెమికల్‌ పౌడర్‌ లోడ్‌తో వెళ్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో  కెమికల్‌ లారీలో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన డ్రైవర్‌ రామచందర్‌యాదవ్‌ (40), క్లీనర్‌ ప్రకాష్‌ సింగ్‌(30) మంటల్లో సజీవదహనమయ్యారు. ఈ ఘటన కారణంగా తెల్లవారుజాము 3గంటల నుంచి 6గంటల వరకు రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఏఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని వాహన రాకపోకలను పునరుద్ధరించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.