ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టనున్నఅథితి గజపతి ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 07:55 PM

ఎన్నికల ఫలితాలు వెలువడి పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూశాక విజయనగరం జిల్లాలోని టీడీపీ నాయకులు ఇప్పటికీ కోలుకోలేక ఇంటి నుంచి బైటకి రాలేకపోతున్నారు. జిల్లాలో ఎవరూ ఊహించని విధంగా రికార్డులను తిరగరాస్తూ వైసిపి తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో, జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముఖం చూపించలేని పరిస్థితి నెలకొంది. ఎన్నో ఆశలు పెట్టుకొని ఎవరికి తగినట్టు వారు ఆ స్థాయిలో ఖర్చు పెట్టి గెలుస్తారు అనుకున్న నియోజకవర్గాలు సైతం చేజారిపోయేసరికి టీడీపీ క్యాడరంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. మరి తెలుగు తమ్ముళ్ళు ఈ షాక్‌నుంచి బయట పడేదేప్పుడూ..? టీడీపీ కేడర్‌లో నైరాశ్యాన్ని పోగొట్టేదెప్పుడూ..? స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మళ్లీ అందరినీ యుద్ధానికి సిద్ధం చేసేదెవరు..? ఇదే ప్రస్తుతం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే జిల్లా టీడీపీకి ఇంతవరకు పెద్దదిక్కుగా కనిపించిన మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక గజపతి రాజు ఇంకా మౌనంగానే ఉండడం, జిల్లా నాయుకుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ సమయంలో పరిస్థితి ని గమనించిన అశోక గజపతి రాజు కుమార్తె అతిథి గజపతి, తన తండ్రి బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకుని జిల్లా నాయకత్వాన్ని, పార్టీని ముందుకు నడిపించేందుకు అడుగులు వేసేందుకు ప్రయత్నం ప్రారంభించారని తెలుస్తోంది. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంటా నంటూ, యువరాణి శపథం చేస్తున్నారు. టీడీపీ సైన్యాన్ని కదంతొక్కిస్తా నంటూ ప్రతిన చేస్తున్నారు. మరి యువరాణిని, టీడీపీ జనం నమ్ముతు రా ఆమె బాటలో నడుస్తారా? యువరాణితో కలిసి కత్తి తిప్పుతారా ? రాజకీయాల్లో ఓనమాలు కూడా రాని ఆమె ,అధికార వైసీపీలోని కాకలు తీరిన నాయకులను ఎదుర్కోవాల్సి వుంది. దీంతో పాటూ జిల్లాలో ప్రస్తుతం వైసీపీకి బలమైన కేడరూ ఉంది. మరీ వీరితో పోటిపడి రాజకీయాల్లో పూర్తిగా కొత్తయిన అతిథి గజపతి, ఏవిధంగా పార్టీని బలోపెతం చేస్తారోనని టీడీపీ కేడరంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. విజయనగరం జిల్లాకు ఇంతవరకు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్‌ గజపతి ఘోర పరాజయం పొందడంతో, ఆయన బయటకు రావడం మానేశారు. ఆయన మౌనం దాల్చడంతో కేడర్‌లో ఎవరు ఉత్సాహం నింపుతారన్న చర్చ ఆ పార్టీ నాయకుల్లో జరుగుతోంది. ఓటమి తరువాత ఆయన అనుసరించే, కార్యాచరణ ఎలా ఉండబోతుందనే విషయమై కేడర్‌ మొత్తం ఎదురు చూస్తోంది. మరోవైపు ఇదే అదునుగా టీడీపీ నుంచి పలువురు నాయకులు వైసిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటు న్నట్లు తెలిస్తోంది. ఇదే జరిగితే రానున్న రోజుల్లో టీడీపీకి గడ్డకాలం రానున్నదని టీడీపీ అభిమానులే గుస గుసలాడుకుంటు న్నారు. మరోవైపు జిల్లాలో ఇప్పటికే వైసిపి క్యాడరు బలపడి పటిష్టంగా ఉంది. ఈ తరుణంలో సీనియర్ నేతలు మౌనం దాల్చడం రాజకీయాల్లో ఓనమాలు రాని అతిథి గజపతి నాయకత్వపు బాధ్యతలు తీసుకోవడం, జిల్లాలో తెలుగుదేశం పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతోందన్న సందేహాలు క్రిందిస్థాయి కేడరులో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాక కొంతకాలంగా జిల్లాలో టీడీపీని వర్గపోరు వెంటాడుతోంది. ఇటువంటి తరుణంలో అన్ని గ్రూపులను ఒకేతాటిపైకి అతిధి గజపతి ఎలా తీసుకొస్తారో, లేక ఎప్పటి లానే, తండ్రి రాజకీయాలను ఫాలో అవుతూ, తనను నమ్ముకున్న బంగ్లా వర్గాన్ని పోషించుకుని, మిగిలినవారిని ఎవరిదారి వారిదే అన్న చందంగా వదిలిపెడతారో, అలా కాకుండా అందరిని కలుపుకుని పార్టీని బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేసి తనముద్ర వేసుకుంటారో చూడా లని పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. మరోవైపు ఓటమి చెందిన నాయకులెవరూ ఇంతవరకు బయటకు రాకపోగా కార్యకర్తలతో గానీ విశ్లేషణలు చేయకపోవడం కాస్తంత ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు స్థానిక సంస్థలతోపాటు, మున్సిపల్‌ ఎన్నికలు రానుండడంతో కేడర్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపి, జిల్లాలోని నియోజకవర్గాల్లో ఆమె పార్టీని ముందుకు నడిపించగల్గుతారో లేదోనని, తెలుగు తమ్ముళ్ళు దిగులు చెందుతున్నా రట. అతిథి గజపతి నాయకత్వాన్ని ఎంతమంది తెలుగు తమ్ముళ్ళు ఆదరిస్తారో జిల్లా ప్రజలు ఆమె నాయకత్వాన్ని ఎలా స్వీకరించి మెచ్చు కుంటారో ఘోర పరాజయంతో దిగులుతో ఉన్న జిల్లా కేడరులో పెద్ద దిక్కై ఆత్మస్థైర్యాన్ని ఎలా నింపునున్నారో ,ప్రణాళికలు రచించి, అధికార పార్టీ వ్యూహ ప్రతివ్యూహ్యలను ఎదుర్కొని, పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారో నన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి.   








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com