రీసైక్లింగ్ చేసే రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం - పౌర సరఫరాల కమీషనర్ కోన శశిధర్

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 18, 2019, 01:27 AM
 

రాష్ట్రంలో బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా తయారుచేసే రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అటువంటి అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను కోరారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నాణ్యమైన బియ్యం సరఫరాపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో బియ్యం రీసైక్లింగ్ పై చాలా ఆరోపణలు ఉన్నాయన్నారు. అటువంటి రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం మోపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్  ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో శ్రీకాకుళం జిల్లాలో  ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు చెప్పారు.