పకడ్బందీగా గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలు

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 18, 2019, 01:23 AM
 

గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 1,3,4,6,7,8 తేదీల్లో నిర్వహించే పరీక్షలపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శని వారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఉద్యోగ పరీక్షలు పారదర్శకంగా, పక్కాగా జరగాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు అవసరమగు పాఠశాలలు, కళాశాలలను గుర్తించాలని., చీఫ్ సూపరింటిండెంట్లను, అదనపు చీఫ్ సూపరింటిండెంట్లను, డిపార్టుమెంటు అధికారులను, ఆయా కళాశాలల సమన్వయ అధికారులు, ప్రత్యేక అధికారుల నియామకానికి అవసరమగు అధికారులు, సిబ్బంది జాబితా తయారు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో పూర్తి మౌళికసదుపాయాలు ఉండాలని అన్నారు. రాత బల్లలు, తాగునీరు, మరుగుదొడ్లు ఉండాలని పేర్కొన్నారు. ప్రతి కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, అవసరమగు మందులను, ఓ.ఆర్.ఎస్  ప్యాకెట్లను సిద్ధం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఎం.చెంచయ్యను ఆదేశించారు. పరీక్షకు అభ్యర్ధులు సకాలంలో చేరుటకు తగిన బస్సులను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ఆర్.టి.సి డిపో మేనేజర్ ప్రవీణను ఆదేశించారు. పరీక్ష సామగ్రిని తీసుకువెళ్ళుటకు, విధులలో ఉన్న అధికారులు పర్యవేక్షించుటకు అవసరమగు వాహనాలను సిద్ధం చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. 1వ తేదీన జిల్లా వ్యాప్తంగాను, మిగిలిన రోజుల్లో శ్రీకాకుళంలోను పరీక్షలు ఉంటాయని అందుకు తగిన ఏర్పాట్లు జరగాలని అన్నారు. పరీక్షల నిర్వాహకులకు, ఇన్విజిలేటర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. మాస్టర్ ట్రైనర్ల శిక్షణకు అనుభవజ్ఞులను పంపించాలని పేర్కొన్నారు.